TDP Mahanadu: మరో రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించుకునే మహానాడు జరగబోతోంది. రాజమండ్రి వేదికగా ఈ మహానాడు వేడుకని నిర్వహించబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద పండగ ఈ మహానాడు అని చెప్పొచ్చు. ఇక పార్టీ క్రింది స్థాయి క్యాడర్ నుంచి ప్రతి ఒక్కరు పాల్గొంటారు. తక్కువలో తక్కువ పది లక్షల మంది వరకు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ అందరూ ఈ మహానాడు కోసం తరలి వెళ్తారు. ఇదిలా ఉంటే ఈ మహానాడు కోసం ఇప్పుడు టీడీపీ మరో కసరత్తు కూడా చేస్తోంది. ఈ మహానాడు వేదికగా రాబోయే ఎన్నికల కోసం ప్రజలని ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాం, పథకాలు ఏం అమలు చేస్తాం, అలాగే విద్యా, ఉపాధి, ఉద్యోగం వంటి వాటి మీద ఎలా ముందుకి వెళ్ళాలి.
మేనిఫెస్టోతో ప్రజలకి ఎలా నమ్మకం కలిగించాలి అనే అంశాలపై టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో మేనిఫెస్టో నిర్ణయాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంటుందంట. అలాగే జనసేనతో పొత్తుల సమీకరణాలపైన కూడా కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాబోయే మహానాడు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకంగా ఉండబోతోంది. వచ్చే ఏడాది మహానాడు మరల ఎన్నికల తర్వాతనే నిర్వహించగలరు. అప్పటికి టీడీపీ అధికారంలోకి వస్తే గ్రాండ్ గా నిర్వహించే ఛాన్స్ ఉంటుంది.
లేదంటే పెద్దగా సౌండ్ ఉండకపోవచ్చు. ఎన్నికలకి ముందు జరగబోయే ఈ మహానాడుని టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. దీని తర్వాత జనసేనతో పొత్తులు, సీట్ల సమీకరణాలపై టీడీపీ నాయకులు చర్చించే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తోంది. ప్రతిపక్షాల లెక్కల ప్రకారం డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పటి క్యాడర్ తో పాటు, నియోజకవర్గాలకి నాయకులని కూడా సిద్ధం చేసుకునే పనిలో అధిష్టానం ఉంది.