RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కోసం రాజమౌళి ఏకంగా 80 కోట్లు ఖర్చు చేసాడని, ఆ డబ్బులు మాకు ఇస్తే 8 సినిమాలు తీసి వారి మొఖాన కొడతాం అంటూ సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ గెలుచుకునే సత్తా కూడా ఆ సినిమాకి లేదని వ్యాఖ్యానించారు. కమర్షియల్ మోజులో పడి సామాజిక స్పృహ ఉన్న కథలని వదిలేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులు పెద్ద ఎత్తున తమ్మారెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా రియాక్ట్ అయ్యారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కి 80 కోట్లు ఎవరిచ్చారు అంటూ చెప్పలేని భాషలో విమర్శలు చేశారు. ఇక నాగబాబు కామెంట్స్ కి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక అసలు వివాదాలలో తలదూర్చని రాఘవేంద్రరావు కూడా తమ్మారెడ్డి వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. 80 కోట్లు ఖర్చు పెట్టినట్లు నీ దగ్గర అకౌంట్స్ ఉన్నాయా? అయితే ఒకసారి చూపించు అంటూ కామెంట్స్ చేశారు. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పిల్ బర్గ్ లాంటి లెజెండరీ దర్శకులు డబ్బులు తీసుకొని ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు అని మీ ఉద్దేశ్యమా అంటూ ప్రశ్నించారు.
మరో వైపు నేచురల్ స్టార్ నాని తన సినిమా ప్రమోషన్ లో భాగంగా కమర్షియల్ సినిమాపై చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. కమర్షియల్ సినిమా లేకపోతే ఈపాటికి సినిమా ఇండస్ట్రీకి నిర్మాతలు ప్యాకప్ చెప్పెసేవారని అన్నారు. ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసే ధైర్యం చేస్తున్నారు అంటే కమర్షియల్ సినిమాల కారణంగానే అని అన్నారు. అలాగే కమర్షియల్ సినిమాల కారణంగానే కొత్త కొత్త కంటెంట్ లని నిర్మాతలు అప్పుడప్పుడు చేయగలుగుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ తో కమర్షియల్ సినిమాల రచ్చ టాలీవుడ్ లో రాజుకుంది అని చెప్పాలి.