Health: ప్రస్తుత దైనందిన జీవితంలో మానసిక ఒత్తిళ్లకి గురయ్యే వారి సంఖ్య బాగా ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న కారణాలకి కూడా కొంత మంది డిప్రెషన్ కి లోనవుతూ ఉంటారు. రోజువారీ జీవన విధానంలో సంతోషకరమైన జీవితాన్ని సాగించాలంటే అన్ని ఎమోషన్స్ మన కంట్రోల్ లో ఉండాలనేది మానసిక నిపుణులు చెప్పే మాట. ఏ ఎమోషన్ కూడా స్థాయికి మించి ఉండకూడదు అని అంటారు. అలా మన భావోద్వేగాల్ని నియంత్రణలో ఉంచుకునే సామర్ధ్యం ఉన్నప్పుడే జీవితంలో ఎదురయ్యే అన్ని ఒడిదుడుకులని తట్టుకునే శక్తి ఉంటుంది.
అయితే పెరిగిన వాతావరణమో, చుట్టూ ఉన్న మనుషుల ప్రభావమో కానీ కొంతమందిలో ఈ ఎమోషన్స్ నియంత్రించుకునే సామర్ధ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా కంట్రోల్ లో లేని ఎమోషన్స్ కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడతాము, కోపం, ద్వేషం ఎక్కువైతే నచ్చని వ్యక్తులని, గొడవ పడేవారిని చంపేయాలనే ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలతో ప్రమాదాలలో చిక్కుకుంటాం. ఇక కొంతమందిలో ఆత్మన్యూనత, భయం ఎక్కువగా ఉంటుంది.
చిన్న చిన్న విషయాలకి కూడా ఇలాంటి వారు భయపడుతూ ఉంటారు. ఈ భయాల కారణంగా జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక వ్యక్తి డిప్రెషన్ లో ఉన్నాడా లేదా అనేది కొన్ని లక్షణాలని గుర్తించడం ద్వారా తెలుసుకోవచ్చి. డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి నిత్యం నిరాశ నిస్పృహతో ఉంటారు. వారు మాట్లాడే మాటలలో ఎక్కువగా నెగిటివిటీ వినిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా నెగిటివ్ కోణంలోనే ఆలోచించి సాధ్యం కాదు, మనవళ్ల కాదు అంటూ ఉంటారు. అలాగే రోజువారీ పనులు కూడా చేయడానికి ఇష్టపడరు. రాత్రివేళలో నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటారు. ఒక విషయాన్ని పదే పదిసార్లు మాట్లాడుతారు.
చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడగడం చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా మాట్లాడే సమయంలో అస్సలు కాన్సంట్రేషన్ చేయరు. ఎంత ప్రాధాన్యత ఉన్న విషయాన్ని చెప్పిన కూడా వారి మనసు పెట్టి వినే ప్రయత్నం చేయరు. అలాగే నవ్వు కూడా చాలా కృత్రిమంగా ఉంటుంది. ఒంటరితనంలో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమందిలో ఉన్న కూడా ఒంటరి అనే ఫీలింగ్ వారి కళ్ళల్లో కనిపిస్తుంది. కలివిడిగా ఉండలేరు. అలాగే చావు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే వారు తీవ్రమైన డిప్రెషన్ లోనే ఉన్నారని అర్ధం చేసుకోవాలి. ఇలాంటి డిప్రెషన్ లో ఉంటే వీలైనంత వేగంగా సైకోథెరఫీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అది మరింత పెరిగి మరణం అంచులకి తీసుకెళ్తుంది.