Saindhav Review : సంక్రాంతి పండుగ సందర్భంగా అగ్ర హీరోల సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది. గుంటూరు కారం తో శుక్రవారం చిన్నోడు మహేశ్ తెరమీద అదరగొడుతుంటే.. శనివారం పెద్దోడు వెంకటేశ్ సైంధవ్ తో సందడి చేసేందుకు వచ్చేశాడు. వెంకటేశ్ సినీ కెరీర్ లో రిలీజైన 75వ సినిమా సైంధవ్. శైలేష్ కొలను రైటింగ్స్, డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేశ్‌తో పాటు, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ వంటి తారలు ఈ మూవలో కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని స్వరపరచగా , నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్యానెర్ లో నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ మూవీని ప్రోడ్యూజ్ చేశారు. కొత్తతరం యాక్షన్ స్టోరీతో వచ్చిన సైంధవ్ తో వెంకటేశ్ తన మార్క్ ను ఇందులో చూపించాడా? అసలు సినిమా కథేంటి? కథనం ఎలా ఉంది? నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సైధవ్ కథ ఏమిటంటే :
చంద్రప్రస్థ అనే సిటీలో సాగే స్టోరీ సైంధవ్. సైంధవ్ అలియాస్ సైకో అనే పాత్రను పోషించారు వెంకటేశ్. తన ప్రాణమైన కూతురు గాయత్రి తో కలిసి ఓ చిన్న ఇంట్లో ఉంటుంటాడు. ఇక భర్త నుంచి డివోర్స్ తీసుకున్న మనో క్యారెక్టర్ పోషించిన శ్రద్ధా శ్రీనాథ్‌తో వెంకటేశ్ కు రిలేషన్ ఏర్పడుతుంది. గతంలో కార్టెల్ అనే ఓ కంపెనీలో సైకో పనిచేసేవాడు. వివాహం తర్వాత తన వైఫ్ కి ఇచ్చిన మాట కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేస్తాడు. కూతురే పంచప్రాణాలుగా బతుకుతుంటాడు. ఈ క్రమంలో ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’అనే వ్యాధితో గాయత్రి పోరాడుతుంది. ఆమె ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఆ జబ్బు నుంచి పాపను క్యూర్ చేసేందుకు అక్షరాలా రూ.17 కోట్ల పలికే ఓ ఇంజెక్షన్ అవసరమవుతుంది. అన్ని కోట్లు పలికే ఆ ఇంజెక్షన్ ను సైకో ఎలా కొంటాడు? తన పాప ప్రాణాలను ఎలా కాపాడుతాడు? చిన్న పిల్లల అక్రమంగా తరలించే కార్టెల్ కంపెనీ నిర్వాహకుడు వికాస్ మాలిక్ విలన్ పాత్ర పోషించిన నవాజుద్దీన్ సిద్ధిఖీనితో సైకో ఎలా సాగింది?అనేది సినిమా చూసే తెలుసుకోవాలి.
కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? :
ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకున్న వెంకటేశ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకటేశ్ తన 75వ సినిమాగా యాక్షన్ కథను ఎంచుకోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. యువ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన మూవీ కాడంతో అంచనాలు పెరిగాయి. వెంకటేశ్ సెలక్షన్ బాగుంది. దర్శకుడు చూపించిన విధానం అందరిని మెప్పించింది. అయితే..కథనంలోనే కాస్త లెక్క మారినట్లు తెలుస్తోంది. గతంలో తన సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించిన శైలేష్ ఈ మూవీలో ఆ ప్రభావాన్ని చూపించలేకపోయాడు. కథ వరకూ ఓకే కానీ కథనం చాలా సింపుల్ గా అనిపించింది. దాంతో సినిమా అంతా పేలవంగా సాగింది. అయితే ప్రాణాపాయంలో ఉన్న తన పాపను కాపాడుకునేందుకు సైంధవ్ కార్టెల్‌లోకి సైకో వచ్చిన తర్వాత ఫస్ట్ హాప్ ఒకింత పర్వాలేదనిపిస్తుంది. ఇక ఇలాంటి థ్రిల్ మూవీస్ కి సెకెండ్ హాఫ్ చాలా కీలకం కానీ హీరో ఫ్లాష్‌బ్యాక్ మొదలుకొని… కూతురుతో పాటు ఇంకా చాలా మంది చిన్నారులు డేంజర్ లో పడటం, కంటైనర్ల కోసం విలన్ సైంధవ్‌ని ఛేజ్ చేయడం అన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలే . కానీ వీటిలో ఏ ఒక్క అంశానికీ ఫినిషింగ్ లేకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్లతోనే కనిచ్చేశారు. దానివల్ల భావోద్వేగాలూ బలంగా పండలేదనే టాక్ ఉంది. వెంకటేశ్ యాక్షన్ సీన్స్, ఆయన స్టైలిష్ లుక్,బాలీవుడ్ హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ క్యారెక్టర్ మినహా సైంధవ్ లో చెప్పుకోదగ్గ అంశమేదీ పెద్దగా కనిపించదు. సినిమా స్టార్టింగ్ నుంచి గన్ షూటింగ్ లే. చాలా వరకు క్యారెక్టర్లు అసంపూర్ణంగా కనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ సీన్స్ అయితే సాదాసీదాగా సాగిపోయాయి.
నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే? :
వెంకటేశ్ ఎప్పటిలాగే తన క్యారెక్టర్ కి న్యాయం చేశారు. యాక్షన్ అవతారంలో అలరించారు. అయితే ఈ మూవీలో వెంకీ మరింత స్టైలిష్‌గా కనిపించారు. ఆయన చేసిన యాక్షన్ సీన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. సెంటిమెంట్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించారు. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలనిజాన్ని ఓ రేంజ్ లో ప్రదర్శించారు. ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది. సిల్లీ గా కనిపిస్తూనే మరోవైపు భయపెడుతుంటాడు. ఇక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తన పరిధిమేరకు నటించింది. ఇక ఆర్య, ఆండ్రియా, రుహానీ శర్మ, ముఖేష్ రుషి , జయప్రకాశ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.ముఖ్యంగా టెక్నికల్ టీమ్ లో కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. మణికందన్ ఇంద్రప్రస్థను చూపించిన తీరు అందరికి నచ్చుతుంది.