Political Talk: తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సమీకరణాలు ఎన్నికల ముందు వచ్చేసరికి పూర్తిగా మారేలా కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలో అమిత్ షా భేటీ అయ్యారు. ఇక మోడీతో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. వీరి కలయిక ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీలో చూసుకుంటే అసలే జనసేన, టీడీపీ పొత్తు ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీలో ఇప్పటికే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. జనసేన ఓటు షేర్ గత ఎన్నికలతో పోలిస్తే పెరిగింది.
అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా మారేలా కనిపిస్తోంది. అదే జరిగితే 2014 ఎన్నికల రిజల్ట్ రిపీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జనసేన పార్టీ ప్రభావాన్ని ఎన్నికల ముందు తగ్గించే ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉండగా సడెన్ గా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రని ఖరారు చేశారు. ఈ యాత్ర జరిగితే కచ్చితంగా పవన్ కళ్యాణ్ కి మరింత ఇమేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాపు యువత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. ఇప్పటికే వారు గ్రౌండ్ లెవల్ లో అందరిని మోటివేట్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేశారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలని కలవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే మాట వినిపిస్తోంది. తెలంగాణలో టీడీపీకి గ్రౌండ్ లెవల్ లో బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ గెలుపుకి టీడీపీ సహకరిస్తుందని, దానికి బదులుగా ఏపీలో టీడీపీ గెలుపుకి సపోర్ట్ చేయాలని అడిగినట్లు సమాచారం. దీనికి బీజేపీ నుంచి ఇంకా ఒక స్పష్టత రాలేదని టాక్. అయితే పవన్ కళ్యాణ్ తమతో ఉన్నారు కాబట్టి కచ్చితంగా బీజేపీ కలిసొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఈ రాజకీయ సమీకరణాలు రానున్న రోజులలో ఎలా మారుతాయనేది చూడాలి.