ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ రచ్చ నడుస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి అధికార పార్టీ తమపై నిఘా పెట్టడానికి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రశ్నిస్తున్నామని కక్ష పెంచుకొని అనుమానంతో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి వేధిస్తున్నారని అన్నారు. తాను తన ఫ్రెండ్ తో మాట్లాడిన మాటల గురించి ఇంటలిజెన్స్ చీఫ్ అడగడంతోనే తనకి సందేహం వచ్చిందని, ఇక ఆరోగ్య రక్ష కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ పెట్టినపుడు ఇంటలిజెన్స్ అధికారులు వచ్చి తనని ప్రశ్నించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఆనం రామనారాయణరెడ్డి కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు.
అయితే వీరిద్దరూ మంత్రి పదవులు రాకపోవడంతో అప్పటి నుంచి అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశంలోకి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఇలా బురదజల్లుతున్నారు అంటూ వైసీపీ నేతలు, ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పార్టీ నుంచి బయటకి వెళ్లిపోతామని అనుకుంటే తమకి ఎలాంటి అభ్యంతరం లేదని, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు అసత్య ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. ప్రభుత్వానికి ఎవరి ఫోన్ లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అయితే తాజాగా కోటంరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 35 మంది ఎమ్మెల్యే, 5 మంది మంత్రులు తనకి ఫోన్ చేసి మాట్లాడారని, వారి ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లు వాపోయారని బాంబు పేల్చాడు. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఈ ఫోన్ ట్యాపింగ్ అగ్గి రాజుకున్నట్లు అయ్యింది. అనుమానించే చోట తాను అవమానాలు భరిస్తూ ఉండలేనని, వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేయను అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారడంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యే ల దారిలో ఇంకెంత మంది వస్తారనేది ఆసక్తికరంగా మారింది.