Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నాలుగు రోజులు రాజకీయ కార్యాచరణని పవన్ సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా రెండో రోజు కాపు సంఘాలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఇక ఈ సమావేశంలో హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను అన్ని కులాల వారీని కలుపుకొని వెళ్లాలని చెబుతాను. కాపులు పెద్దన్న పాత్ర పోషించి రాజ్యాధికారం రాని కులాలని కలుపుకొని వెళ్ళడం ద్వారా అధికారంలోకి రావొచ్చు.
అయితే కులంలోనే ఎవరికి నచ్చినట్లు వారు విడిపోయి వెళ్ళడం వలన ఎప్పటికి అధికారాన్ని అందుకోలెం. కాపులు నిజంగా నన్ను తమవాడిగా అనుకోని వుంటే భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో ఓడిపోయేవాడిని కాదని అన్నారు. అలాగే తాను పుట్టిన కులాన్ని విస్మరించుకొను అని కూడా తెలిపారు. అలాగే కాపులు తలవంచుకునే పని తాను ఎప్పుడూ చేయనని తెలిపారు. తాను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టె ప్రయత్నం చేయనని అన్నారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా పార్టీకి నష్టం కలిగించే కుట్రలు చేస్తున్నారని అన్నారు.
రాజకీయాలు అంటే కుట్రలు, కుతంత్రాలు సర్వసాధారణం అని అన్నారు. వాటిని ఎదుర్కొని బలంగా నిలబడాలి అని అన్నారు. తాను ఎవరికి అమ్ముడుపోయే వ్యక్తిని కాను. ఎవరో వెయ్యి కోట్లు ఆఫర్ అని ప్రచారం చేస్తారు. ఇంకొకరు అమ్ముడుపోయా అంటారు. తాను సినిమా చేస్తే రోజుకి రెండు కోట్లు సంపాదిస్తా ఆ సామర్ధ్యం తనకి ఉంది. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా సినిమాలు చేసుకునేంత ఇమేజ్ ఉంది. కాని వాటన్నిటి కంటే నాకు కేవలం ప్రజలకి సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేనని రాజ్యాధికారంలోకి తీసుకురావడంలో మీరే కీలక పాత్ర పోషించాలని తెలిపారు.