Technology: అప్పుడెప్పుడో శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమాలో మానవ శరీరంతో, హ్యూమన్ ఎమోషన్స్ తో పనిచేసే రోబోలు ఈ ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా తెరపై చూపించారు. ఒకవేళ మనిషిలాంటి రూపంతో పాటు, ఎమోషన్ ఉంటే అవి కూడా మానవ భావోద్వేగాలకు స్పందిస్తే మానవుడు తయారుచేసిన యంత్రం మళ్లీ మానవ మనుగడకే ముప్పు తీసుకొస్తుందని సినిమాలో చూపించారు. ఇలాంటి కథాంశంతో హాలీవుడ్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి.
అయితే శాస్త్రవేత్తలు మాత్రం రోబోలకు హ్యూమన్ బిహేవియర్ ని పెట్టాలనే పరిశోధనలకి మాత్రం ఫుల్స్టాప్ పెట్టలేదు. ఆ దిశగా చాలా దేశాలు రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంలో సరికొత్త మార్పులను తీసుకొస్తూ కొత్త కొత్త అధ్యాయాలతో పరిశోధనలు విస్తృతంగా చేస్తున్నాయి. ఇప్పుడు ఆ దిశగా మరో ముందడుగు పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటేషనల్ వినియోగంతో రోబోటిక్ టెక్నాలజీలో అచ్చం మనిషిని పోలిన రోబోలను తీసుకురావాలనే ప్రయత్నానికి కొత్త మార్గం దొరికింది.
టోక్యో పరిశోధకులు బయో హైబ్రిడ్ విధానంలో కంట్రోల్ రోబోటిక్ ఫింగర్ సృష్టించారు. ఈ చేతి వేలికి సజీవ మానవ చర్మకణాలను ఉపయోగించిన తొడుగు వాడరు. ఇక దానిపై ప్రయోగం చేయగా ఈ రోబోటిక్ ఫింగర్ స్పర్శకు అనుగుణంగా స్పందించడం, గాయం అయినా కూడా దానంతట అదే బాగు చేసుకోవడం చేసింది. హైడ్రోజెల్ అని పిలిచే సింథటిక్ చర్మాన్ని దీనికోసం తయారు చేశారు. దీనిలో సజీవ చర్మకణాలను పెట్టారు. దీంతో అచ్చం మనిషి చర్మం లానే ఇది కనిపించింది.
హ్యూమనాయిడ్ రోబోలు ఆవిష్కరించడంలో ఇది సరికొత్త మార్పుగా పరిశోధకులు తెలుపుతున్నారు. ఇక ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందితే భవిష్యత్తులో రోబోలను మనుషులను వేరువేరుగా గుర్తించడం చాలా కష్టం అవుతుంది అని అంటున్నారు. మరి ఈ విప్లవాత్మకమైన మార్పులలో జరగబోయే విధ్వంసాన్ని కూడా గుర్తిస్తే మంచిదని కొంతమంది మేధావులు అంటున్నారు.