Family: పిల్లలు పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం అనే సంగతి అందరికి తెలిసిందే. వారు ఎదిగే క్రమంలో తమకి ఎదురుగా ఉన్న తల్లిదండ్రుల నుంచే అన్ని విషయాలు చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చేసే పనులని వాళ్ళు కూడా రిపీట్ చేయడానికి ఇష్టపడతారు. అలాగే వాటినే తమ అలవాటుగా మార్చుకుంటారు. అందుకే ఎదిగే వయస్సులో పిల్లల ముందు తల్లిదండ్రులు కచ్చితంగా కొన్ని విషయాలు చేయకూడదని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. వాటిలో ముఖ్యంగా పిల్లల ముందు ఎప్పుడు కూడా గొడవ పడే ప్రయత్నం చేయకూడదు. అలాగే పిల్లలు చూస్తున్న సమయంలో భర్త భార్య మీద కానీ, భార్య భర్త మీద కానీ పెత్తనం చేసే విధంగా బిహేవ్ చేస్తే దానిని వారు కూడా మైండ్ కి ఎడాప్ట్ చేసుకుంటారు.
భవిష్యత్తులో వారికి కూడా పెత్తనం చేసే అలవాటు వస్తుంది. అలాగే వారి ముందు ఎవరితో అయినా మాట్లాడే సందర్భంలో కచ్చితంగా భాష మర్యాదగా ఉండేలా చూసుకోవాలి. మనం మాట్లాడే భాష సరైన విధంగా లేకపోతే వారు స్కూల్ లో ఇతర పిల్లలతో మాట్లాడే సందర్భంలో అలాంటి మాటతీరుతోనే మాట్లాడుతారు. అలాగే పెద్దవాళ్ళ గురించి చర్చించే సమయంలో కచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ చేయకూడదు. ఎవరి మీదనైన మనకి కోపం ఉన్న కూడా పిల్లల ముందు వారిని విమర్శిస్తూ, లేదంటే హేళన చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. ఆ వ్యక్తులు వచ్చినపుడు పిల్లలు తెలియకుండానే వారిని హేళన చేసి మాట్లాడుతారు.
అలాగే గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ విషయంలో పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాటిని పిల్లల ముందు చూపించకూడదు. వారు కూడా భవిష్యత్తులో వాటిని అలవాటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. పిల్లల జీవితాలకి వారి కళ్ళముందు ఉన్న తల్లిదండ్రులే రోల్ మోడల్స్ గా ఉంటారు. అలాగే పిల్లలకి అర్ధమయ్యే విధంగా వారు చూస్తుండగా ఎవరితో కూడా అబద్ధాలు ఆడొద్దు. అలా మాట్లాడితే వారు కూడా ప్రతి చిన్న విషయానికి అబద్దాలు ఆడటం మొదలు పెడతారు.
అలాగే ప్రయాణ సమయాలలో కూడా వారు మనల్ని అనుకరిస్తూ ఉంటారు. ఈ కారణంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం, వాహనాల కి అడ్డంగా పరుగు పెట్టడం చేయకూడదు. వారి ప్రతి అలవాటుకి మనమే కారణం అనే విషయాన్ని గుర్తుంచుకొని తల్లిదండ్రులు అర్ధం చేసుకొని ప్రవర్తిస్తే కచ్చితంగా వారికి మంచి అలవాట్లు వస్తాయి. అలాగే మగపిల్లల దగ్గర ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు, అలాగే వారు వేసుకున్న వస్త్రధారణ మీద తప్పుగా కామెంట్స్ చేయకూడదు. ఆలా చేస్తే వారిలో కూడా మేల్ ఆటిట్యూడ్ పెరిగిపోతుంది. ఆడవాళ్ళని కంట్రోల్ చేయాలనే బిహేవియర్ పెరుగుతుంది. ఇది ఈ కాలంలో చాలా ప్రమాదకరం. జెండర్ ఈక్వాలిటీ, కమ్యూనిటీ ఈక్వాలిటీ వారికి వారికి అలవాటు అయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది.