Nara Lokesh: ఏపీలో ప్రతిపక్ష పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న ఈ పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇక ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల అవినీతిపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేస్తూ సాగుతున్నారు. అవినీతి భాగోతాలని ఆధారాలతో సహా పబ్లిక్ లో చూపిస్తున్నారు. అయితే నారా లోకేష్ పాదయాత్రని వైసీపీ పట్టించుకోకూడదు అనే ఆరంభంలో అనుకుంది. కాని రోజు రోజుకి లోకేష్ కి ప్రజాదారణ పెరుగుతూ ఉండటం కనిపిస్తుంది. వైసీపీ బలం ఉన్న రాయలసీమ జిల్లాలలోనే నారా లోకేష్ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
దీంతో వైసీపీ కూడా లోకేష్ చేసే విమర్శలపైన ఆలోచిస్తూ ఉంది. ముఖ్యంగా నియోజకవర్గాలలో పాదయాత్ర చేసే సమయంలో స్థానిక ఎమ్మెల్యే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. లోకేష్ విమర్శలకి ఎదురుగా ప్రతి విమర్శలు చేయకపోతే ప్రజలు నిజమని అనుకునే ప్రమాదం ఉందని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తుంది. ఈ నేపధ్యంలో నారా లోకేష్ చేసే విమర్శలపై ఎప్పటికప్పుడు మీడియా ముందుకి వచ్చి కౌంటర్లు ఇస్తున్నారు. ఓ విధంగా లోకేష్ ని ప్రజా నాయకుడుగా వైసీపీ వారే ఒప్పుకుంటున్నారు అని చెప్పాలి.
ఇదే పంథాలో లోకేష్ యాత్ర కొనసాగితే రానున్న రోజుల్లో కచ్చితంగా పల్నాడు, కోస్తా, ఉత్తరాంద్ర జిల్లాలలో బలమైన ప్రభావాన్ని చూపిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక లోకేష్ కి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ నేపధ్యంలో చంద్రబాబు కూడా తన వ్యూహాలని మార్చుకొని క్యాడర్ ని సమాయత్తం చేసే పనిలో పడ్డారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. జనసేనతో పొత్తు విషయంలో ఎన్నికల ముందు పునరాలోచించవచ్చు అని డిసైడ్ అయ్యి పూర్తిగా ఆ అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టడానికి కారణం కూడా లోకేష్ పాదయాత్ర అని చెప్పాలి.