Nagababu: ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోన్న జనసేన పార్టీ నెమ్మదిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. తమకున్న బలం, అవకాశాలు చెక్ చేసుకొని కచ్చితంగా గెలుస్తామనుకునే నియోజకవర్గాలపై ముందుగా ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే పార్టీ వ్యవహారాలకి పవన్ కళ్యాణ్ నాగబాబుకి అప్పగించారు. నాదెండ్ల మనోహర్, నాగబాబు జిల్లాల వారీగా తిరుగుతూ క్యాడర్ తో మాట్లాడుతూ జనసేనాని వ్యూహాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పార్టీలో బలమైన అభ్యర్ధులని గుర్తించడంపై దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలెట్టే సరికి కచ్చితంగా వంద స్థానాల వరకు తమ బలం పెంచుకోవాలని జనసేనాని భావిస్తున్నారు.
వారాహి యాత్ర ద్వారా మరింతగా బలం పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. అయితే ప్రత్యర్ధి పార్టీలైన వైసీపీ, టీడీపీ మైండ్ గేమ్ ఆడుతూ జనసేన క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. జనసైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు. అయితే పొత్తు ఖాయం అయిపోయింది అని టీడీపీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తీసుకున్నాడు అని వైసీపీ ప్రచారం చేస్తూ జనసైనికులని భయపెడుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ వైపు నిలబడతామని అనుకుంటున్న వారిని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నాగబాబు ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. తాజాగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో రాంబిల్లిలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తులపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని, గతంలో పోల్చుకుంటే మనబలం పెరిగిందని, దానికి తగ్గట్లుగా మన డిమాండ్లకి అంగీకరిస్తే పొత్తులు ఉంటాయని అన్నారు. అధినేత ఎవరిని నిలబెడితే వారిని గెలిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. పొత్తులు ఉంటే అధినేత నేరుగా చెబుతారని, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న పార్టీ ఎదుగుదలని దృష్టిలో పెట్టుకొని బలమైన నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. నాగబాబు వ్యాఖ్యలు ఇప్పుడు జనసైనికులకి ఉత్సాహాన్ని ఇచ్చాయి.