Mudragada Padmanabham: కాపు ఉద్యమనేతగా ఏపీలో గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాపులకి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేశారు. అలాగే తునిలోలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆ సమయంలో రత్నాచల్ రైలుని దగ్ధం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే కాపులకి రిజర్వేషన్ అయితే రాలేదు కాని ముద్రగడతో పాటు చాలా మంది మీద కేసులు నమోదు అయ్యాయి. ఆ ఘటన కారణంగా కాపుల ఓటింగ్ పెద్ద ఎత్తున వైసీపీకి టర్న్ అయ్యింది.
జనసేనకి వేయాలని అనుకున్న వారు కూడా వైసీపీ వైపే నిలబడ్డారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల రిజర్వేషన్ అంశంపై నాలుగేళ్లలో ముద్రగడ ఎలాంటి ఉద్యమం చేయలేదు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు. అప్పుడప్పుడు జగన్ ని బ్రతిమలాడుతూ లేఖలు విడుదల చేశారు. దీనిని బట్టి వైసీపీకి సపోర్ట్ గానే ముద్రగడ కాపు ఉద్యమం నడిపించారనే ప్రచారం ప్రజల్లోకి వెళ్ళింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. తాజాగా తుని రైలు దగ్ధం ఘటనలో కేసులని కోర్టు కొట్టేసింది.
దీంతో ముద్రగడ మరల రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నపళంగా కాపుల అజెండా వేసుకొని ముద్రగడ ఫ్రేమ్ లోకి వచ్చారు. త్వరలో తన రాజకీయ భవిష్యత్తుని ప్రకటిస్తా అని కీలక స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన కాకుండా ముద్రగడ కుమారుడిని వైసీపీలో చేర్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం ద్వారా ఆయన రాజకీయంగా యాక్టివ్ కావాలని ప్రయత్నం చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.
జనసేన మానియాని, కాపులలో పవన్ పై పెరుగుతున్న సింపతీని తగ్గించే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు ముద్రగడ రాజకీయ రంగ ప్రవేశం అనేది తెరపైకి వచ్చిందనే మాట వినిపిస్తోంది. ఆయన కచ్చితంగా వైసీపీ గూటికి చేరే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అయితే కాపుల రిజర్వేషన్ సాధ్యం కాదని చెప్పిన వైసీపీ గూటికి వెళ్తే ముద్రగడకి ఉన్న ఇమేజ్ కాపులలో పూర్తిగా పోతుందనే మాట తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.