MLC Elections: ఏపీలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తొమ్మిది స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. ముందే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి. మిగిలిన నాలుగు స్థానాలకి పోటీ జరగగా వాటిని కూడా వైసీపీ భారీ మెజారిటీతో గెలుచుకున్నాయి. అయితే స్థానిక సంస్థలలో మెజారిటీ వైసీపీకి చెందిన వారె ఉండటంతో వాటిని గెలుచుకుంది. అయితే టీచర్, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం వైసీపీకి కొంత ప్రతికూలత ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఉత్తరాంద్ర మీద వైసీపీ చాలా గట్టిగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంద్రలోని గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడం ద్వారా రాజధాని కోరిక అక్కడి ప్రజలకి ఉందనే భావనని వైసీపీ ప్రాజెక్ట్ చేయాలని భావించింది.
అయితే అనూహ్యంగా టీడీపీ బలపరిచిన అభ్యర్ధి వేపాడ చిరంజీవి తన సమీప అభ్యర్ధి వైసీపీ నేత సీతంరాజు సుధాకర్ కంటే భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే అధికారికంగా ఖరారు కాకపోయినా కూడా టీడీపీ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలుపు ఖరారు అయినట్లే అనే మాట వినిపిస్తుంది. ఇక దీని ద్వారా విశాఖ రాజధాని ఉత్తరాంద్ర ప్రజల కోరిక అని చెబుతూ ఉన్న వైసీపీకి షాక్ తగిలింది అని చెప్పాలి. విశాఖ రాజధాని కావాలనే ఆశ ఉత్తరాంద్రలోని గ్రాడ్యూయేట్స్ కి కూడా లేదంటే, ఇక సామాన్య ప్రజలకి అసలు ఉండదనే మాట టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఓ విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విశాఖపట్నంలో వైసీపీ ఓడిపోవడం అంటే కచ్చితంగా రాజధానికి వ్యతిరేకంగా వారి అభిప్రాయాన్ని సుస్పష్టం చేసినట్లే అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మరి దీనిపై ఉత్తరాంద్ర వైసీపీ నేతలు జగన్ నుంచి గట్టిగా ఆగ్రహాన్ని చవిచూసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అలాగే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ పోటీలలో రెండు స్థానాలని టీడీపీ గెలుచుకోవడం విశేషం. ఇక వైసీపీ ఒకటి గెలుచుకోగా మరో చోట రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నడుస్తుంది.