Inspiring: ఈ సమాజంలో మనం చేసే పని, ఆడే మాట, వెళ్ళే మార్గం, అర్ధం చేసుకునే విషయం ఏదైనా కూడా మంచి విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. మన విచక్షణ మీదనే ఆధారపడి మన జీవితంలో భవిష్యత్తు ఉంటుంది. ఆ విచక్షణా జ్ఞానం ఒక్కొక్కరికి ఒక్కోలా పని చేస్తుంది. చాలా మంది తాము ఆడే మాటలని సమర్ధించుకుంటూ ఉంటారు. నేను ఏది మనసులో దాచుకోలేను. ఏదైనా అనాలని అనిపిస్తే అనేస్తా అంటారు. మరికొందరు నేను ఎవరిని ఏమీ అనలేను. నా మంచితనం నన్ను మాట్లాడనివ్వదు అని అంటారు.
అయితే ఈ రెండు రకాల మనస్తత్వాలు కూడా సమాజంలో ప్రమాదకరమనే చెప్పాలి. ఎవరు ఏం అన్నా కూడా మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతే కొందరు మంచితనం అంటారేమో కాని చాలా మంది చేతకానితనం అంటారు. అలాగే ఎవరైనా ఏదైనా మాట అంటే వెంటనే వారికి లాగిపెట్టి కొట్టేలా ఎదురు సమాధానం చెప్పడం తెలివైన పద్ధతి అనుకుంటున్నారేమో… కాని చాలా మంది మూర్ఖత్వం, టెంపరితనం అనే అభిప్రాయాన్ని సమాజంలోకి తీసుకొని వెళ్తుంది. సమాజంలో ఉన్న తర్వాత ఏ స్థాయిలో ఉన్న కూడా పదిమందితో కలిసి ప్రయాణం చేయాల్సిందే. ఆ పదిమందిలో మనల్ని అభిమానించే వారు ఉంటారు. ద్వేషించే వారు ఉంటారు. మన ఎదుగుదలకి సహకరించే వారు ఉంటారు. అంత మంది మధ్యలో ఉన్న తర్వాత ఆడే మాట, చేసే పని, తీసుకునే నిర్ణయం అన్ని కూడా మన విచక్షణని, మన స్థాయిని ఈ సమాజంలో నిర్ణయిస్తాయి.
గొప్పవాళ్ళుగా చెప్పబడుతున్న అందరూ కూడా సరైన సమయంలో వారి విచక్షణాజ్ఞానాన్ని సరైన పద్దతిలో ఉపయోగించడం ద్వారా ఈ రోజు సమాజంలో ప్రతి ఒక్కరు చర్చించుకునే స్థాయిలో ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి. ఈ విచక్షణ జ్ఞానం సమాజంలో ప్రతి విషయంలో మన ఎలా స్పందించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అనే కామన్ సెన్స్ ని కలిగి ఉండేలా చేస్తుంది. ఎదుటివారు ఏదైనా మాట్లాడవచ్చు. ఎలా అయిన మాట్లాడవచ్చు. వారి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, సిచువేషన్ బట్టి వారి మాట్లాడే తీరు ఉంటుంది. ఆ మాటలకి మనం ఎలా రెస్పాండ్ అయ్యాం అనేది మన ఎమోషనల్ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంటే రెస్పాండ్ అయ్యే విధానం మారుతుంది. అలాగే మనం రెస్పాండ్ అయిన అంశంపై ఎలా రియాక్ట్ కావాలనేది మన ఎమోషనల్ బ్యాలెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. మెంటల్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మన ఎదుగుదలని నిర్ణయిస్తుంది.
మన స్థితిని ఈ సమాజానికి పరిచయం చేస్తుంది. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంటే మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా రెస్పాండ్ అయ్యే అంశంపై లోతుగా అధ్యయనం చేసి తరువాత సరైన పద్దతిలో రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. నువ్వు నిజంగా సమాజంలో గొప్పగా ఎదగాలన్నా, పదిమంది మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గౌరవించాలన్నా ఆ రెస్పాండ్ అండ్ రియాక్షన్ అనేది చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రెండు కరెక్ట్ గా ఉండాలంటే మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి.