Movies: ఇళయదళపతి విజయ్ వారసుడు సినిమా వివాదం రోజు రోజుకి పెరుగుతున్నట్లే కనిపిస్తుంది. సినీ కార్మికులు బంద్ చేస్తున్న సమయంలో వారసుడు షూటింగ్ ఆపకుండా అది తమిళ్ మూవీ అని దిల్ రాజు చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు. తరువాత వంశీ పైడిపల్లి కూడా వారసుడు పంక్తు తమిళ్ మూవీ అని, వారి నేటివిటీకి అనుగుణంగానే సినిమాని చేసినట్లు చెప్పాడు. అయితే ఈ వారసుడు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు జనవరి 12 డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. అదే సమయంలో మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో వారసుడు సినిమా వాయిదా వేసుకోవాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి దిల్ రాజుకి ఆదేశాలు జారీ చేస్తూ లేఖ విడుదల చేశారు.
గతంలో దిల్ రాజు చెప్పినట్లే పండగ సమయాలలో పెద్ద తెలుగు సినిమాలు రిలీజ్ అయితే డబ్బింగ్ సినిమాలు వాయిదా వేసుకోవాలని చెప్పాడు. ఇప్పుడు అదే మాటని నిర్మాతల మండలి దిల్ రాజుకి చెప్పింది. అయితే ఈ విషయంపై దిల్ రాజు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయాలేదు. అలాగే వారసుడు సంక్రాంతి రిలీజ్ నుంచి వెనక్కి వెళ్ళాలన్న నిర్ణయంపై తమిళ ప్రేక్షకులు, విజయ్ అభిమానులు మాత్రం సీరియస్ అవుతున్నారు. వారసుడు సినిమాని ఏమైనా సంక్రాంతికి రిలీజ్ చేయకుండా వాయిదా వేస్తే మాత్రం తెలుగు సినిమాలకి తమిళనాడులో అలాంటి పరిస్థితే వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా ఇదే విషయంలో తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న లింగుస్వామి కూడా తీవ్ర విమర్శలు చేసి నిర్మాతలకి నేరుగా హెచ్చరికలు చేశాడు.
వారిసు తమిళ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ. దీనికి తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఆశించిన స్థాయిలో లభించాలని, అలా కాకుంటే మాత్రం తెలుగు సినిమాలు కూడా భవిష్యత్తులు ఇబ్బందులు పడతాయని హెచ్చరించారు. దీనిపై టాలీవుడ్ అభిమానులు లింగుస్వామిపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. మీరు మమ్మల్ని విమర్శించే ముందు మీ కోలీవుడ్ సినిమాలకి 20 శాతం మేరకు తెలుగు నుంచి షేర్ వస్తుందని గుర్తుంచుకోండి. మమ్మల్ని బెదిరించే స్థాయికి వెళ్లొద్దు. మీలాంటి కోలీవుడ్ దర్శకులకి కూడా మా తెలుగు హీరోలు అవకాశాలు ఇచ్చి సినిమాలు చేస్తున్నారు.
ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు తెలుగులో వారియర్ అనే ఫ్లాప్ సినిమా మాత్రమే తీశారు కానీ మీరు నిజంగా వారియర్ కాదు. మీ తమిళనాడు మీద మేము ఆధారపడటం లేదు. మీ కోలీవుడ్ సినిమాలే తెలుగు ప్రజల మీద ఆధారపడుతున్నాయనేది అర్ధం చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటూ విమర్శలు చేస్తున్నారు. నెటిజన్స్ ట్రోల్స్ పై లింగుస్వామి ఏ విధంగా రియాక్ట్ అవుతాడనేది ఇప్పుడు చూడాలి. అలాగే ఈ వివాదంపై దిల్ రాజు ఎలాంటి క్లారిటీ ఇస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది.