Politics: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ కి పోటీగా బీజేపీ రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కీలకంగా వ్యవహరించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణలో కూడా తన భవిష్యత్తు లేకుండా చేసుకుంటుంది అనే మాట వినిపిస్తుంది. కేవలం స్వయంకృతంతో ఏపీలో ఇప్పటికే పూర్తిగా కనుమరుగయ్యే స్థితిలో కమ్యూనిస్ట్ పార్టీల సరసన కాంగ్రెస్ పార్టీ చేరిపోయింది. కనీసం ఆ పార్టీకి ఏపీలో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది. ఇక తెలంగాణలో 2014 ఎన్నికల సమయంలో విభజన చేసి తెలంగాణ ప్రజల కోరిక తీర్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని అందరూ భావించారు. ఆ నేపధ్యంలోనే చాలా మంది ముఖ్యమంత్రి రేసులోకి కూడా వచ్చారు.
అయితే ప్రజలు ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ ని గుర్తించి టీఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు. రెండో సారి కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. మొదటి సారి కంటే రెండో సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభావం మరింత మసకబారింది. అదే సమయంలో బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ ముందంజలోకి వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మూడో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికి పార్టీలో నాయకులు అందరిని సమన్వయపరిచే నాయకత్వం లేదు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న అతన్ని ద్వేషించే వారు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు.
గతంలో టీపీసీసీ చీఫ్ గా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. అలాగే రేవంత్ రెడ్డితో పొసగని వారు పార్టీతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారు అన్నట్లుగా వారి ప్రయాణం ఉంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని భావిస్తున్న నాయకులు మెల్లగా బీజేపీకి వలస పోతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఇక తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీలో తనకి చోటు కల్పించకపోవడంపై సీనియర్ మహిళ నేత మాజీ మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనని అవమానించారు అంటూ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో ఆమెని కూడా బీజేపీ వైపు లాక్కునే ప్రయత్నాలు బండి సంజయ్ టీమ్ చేస్తుంది. అదే జరిగితే ఇక ఒకరి తర్వాత ఒకరు సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ బీజేపీ వైపు వలసపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిని రేవంత్ రెడ్డి ఎలా నిలువరించి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాడు అనేది చూడాలి.