TS Politics: కర్ణాటకలో తాజాగా జరిగిన ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏకంగా 136 స్థానాలలో గెలిచి ఫుల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా క్లీన్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజలు అప్పగించారు. మోడీ ప్రచారం కన్నడ ప్రజలని ఆకట్టుకోలేదు. అదే సమయంలో రాహుల్ గాంధీ ప్రచారం చేసిన 36 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. దీంతో పాటు ఎన్నికల ముందు బీజేపీ తీసుకొచ్చిన మతతత్వ అజెండాని కూడా కన్నడ ప్రజలు అస్సలు యాక్సప్ట్ చేయలేదు. గతం ఎన్నికలలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి అధికారం వచ్చింది.
అయితే ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి బీజేపీ రెండేళ్ళ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయంలో కూడా కన్నడ ప్రజలు బీజేపీపై కొంత వ్యతిరేకంగా ఉన్నట్లు తాజా ఎన్నికలతో స్పష్టం అయ్యింది. దాంతో పాటు కర్ణాటకలో ఏ పార్టీని వరుసగా రెండో సారి అధికారంలోకి తీసుకొచ్చే సంస్కృతి లేదు. ప్రతి ఐదేళ్ళకి అధికార పార్టీని మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరల అదే రిపీట్ అయ్యింది. మళ్ళీ అధికారంలోకి వస్తామని, సెంటిమెంట్ బ్రేక్ చేస్తామని బీజేపీ భావించిన అది సాధ్యం కాలేదు. బీజేపీని కేవలం 64 స్థానాలకి పరిమితం చేశారు. గత ఎన్నికలలో 100 స్థానాలలో బీజేపీ విజయం సాధిస్తే ఈ సారి భారీగా తగ్గిపోయాయి.
అదే సమయంలో కుమారస్వామి జేడీఎస్ కూడా గత ఎన్నికలలో 32 స్థానాలలో గెలిస్తే ఈ సారి 20కి పరిమితం అయిపొయింది. జీడీఎస్ కి తగ్గిన బలం కాంగ్రెస్ వైపు మల్లడం విశేషం. ఇదే సమయంలో బీజేపీ నుంచి కొంత వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫలితాలు బీజేపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. కర్ణాటకతో పాటు రానున్న ఎన్నికలలో తెలంగాణలో కూడా పాగా వేయాలని ప్రయత్నం చేస్తోన్న బీజేపీకి కొంత ప్రతికూలతగానే మారింది. మరోవైపు ఏపీలో కూడా మూడో ప్రత్యామ్నాయం అని ఆలోచించకుండా టీడీపీ, జనసేన కూటమితో కలవాల్సిన పరిస్థితి వచ్చిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.