TDP: ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తమ క్యాడర్ ని సిద్ధం చేసుకొని వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాన పార్టీలలో స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం, వైసీపీలో జాయిన్ అయ్యి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీలో కూడా చేరే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జనసేన పార్టీలోకి ఒకప్పటి నాయకులకి సంబందించిన చరిత్రని చూసుకొని పవన్ కళ్యాణ్ చేర్చుకుంటున్నారు. అవినీతి నేపధ్యం ఉన్నవారు వస్తానని చెప్పిన కూడా కుదరదు అని చెప్పేస్తున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆ పార్టీని వీడి జనసేనలోకి రావాలని ప్రయత్నం చేశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి అనుమతి లభించకపోవడంతో ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. టీడీపీలో ఈ నెల 23న చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు సమక్షంలో తనతో పాటు రెండు వేల మంది వరకు పార్టీలో చేరుతారని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా విశాఖకి చెందిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా కన్నా లక్ష్మినారాయణతో కలుసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయన కూడా తెలుగుదేశంలోకి వెళ్ళే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కన్నా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తుంది. అలాగే విష్ణుకుమార్ రాజు వస్తే విశాఖలో దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ స్థానాన్ని అతనికి అప్పగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.