అలాంటి దర్శక దిగ్గజం మరణం ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అని చెప్పాలి. గురువారం రాత్రి అపోలో హాస్పిటల్ లో ఆయన మృతి చెందారు. వృద్ధాప్యం కారణంగా గత కొంత కాలంగా విశ్వనాథ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్ కి తరలించారు. అక్కడ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయన వయస్సు 92 ఏళ్ళు. ఇక విశ్వనాథ్ మృతితో తెలుగు చిత్రపరిశ్రమ మూగబోయింది.
ఒక్కసారిగా టాలీవుడ్ ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన మరణం ఇండియన్ సినిమాకి తీరని లోటని అభివర్ణించారు. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కమల్ హాసన్ కూడా వచ్చి పలకరించి వెళ్ళారు. కమర్షియల్ హీరో అయిన చిరంజీవి విశ్వనాథ్ మీద ఉన్న అభిమానంతో ఆ ఇమేజ్ ని పక్కన పెట్టి స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాలు చేశారు. ఈ సినిమాలు చిరంజీవి ఇమేజ్ ని నటుడిగా మరో ఎత్తుకి తీసుకొని వెళ్ళాయి.
అప్పటి నుంచి చిరంజీవికి విశ్వనాథ్ పై ప్రత్యేక అభిమానం ఉంది. ఒక తండ్రి స్థానంలో అతన్ని ఉంచుతాడు. ఇక విశ్వనాథ్ అంటే ఎన్నో కళాఖండాలు కనిపిస్తాయి. శంకరాభరణం సినిమాతో జాతీయ అవార్డుని అందుకోవడంతో పాటు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న సినిమాగా గుర్తింపు తెచ్చిపెట్టారు. అలాగే విశ్వనాథ్ సినిమా అంటే భారతీయ సంగీతం, సాహిత్యం, నృత్యం మూలాలని స్పృశిస్తూ కథ, కథనాలు ఉంటాయనే మాట వినిపిస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎంతో మంది భారతీయ సంగీతం, నృత్యాలపై మక్కువ పెంచుకోవడానికి ఆయన చేసిన స్వర్ణకమలం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శృతి లయలు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అలాంటి మరుపురాని చిత్రాలని తెరకెక్కించిన విశ్వనాథ్ ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా విచారకరం.