Politics: ఏపీలో అధికార వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అమరావతి శాశన రాజధానిగా, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా నిర్ణయిస్తూ ప్రకటన చేసింది. అయితే దీనిపై ఏపీలో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. రాజధాని ఒకటే ఉండాలని అది అమరావతి మాత్రమే ఉండాలని అంటున్నాయి. పాలన వికేంద్రీకరణతో ఎలాంటి అభివృద్ధి జరగదని అంటున్నారు. మీకు సాధ్యం అయితే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని అన్ని జిల్లాలకి అభివృద్ధిని, పరిశ్రమలని విస్తరించాలని, దీని ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం పరిపాలన అమరావతిలోనే జరగాలని, అలాగే అభివృద్ధి అమరావతి వేదికగా చేసి గొప్ప పట్టణాన్ని తయారు చేయాలని భావిస్తుంది.
ఇక మిగిలిన పార్టీలు అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రతిపక్షాల వాయిస్ ని వినడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఎలా అయినా తన పంతాన్ని నెగ్గించుకొని వచ్చే ఏడాది ఉగాది నుంచి విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే దీనికి టీడీపీ అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికలకి కూడా వైసీపీ మూడు రాజధానులు, సంక్షేమ పథకాలు అజెండాగా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం లేదని ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు. విశాఖ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రోడా మేలుగా అనే కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తానికి న్యాయం జరగదని అన్నారు.
వైసీపీ తీసుకున్న ఈ విధానంతో అస్సలు ప్రయోజనం లేదని తెలిపారు. మహారాష్ట్ర తరహాలో ప్రతి జిల్లాని ఒక రాజధాని తరహాలో అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకి కల్పించాలని సూచించారు. అక్కడ 13 ఏళ్ళు పని చేసిన అనుభవంతో చెబుతున్నా, అభివృద్ధి అన్ని ప్రాంతాలకి విస్తరించి ఆయా ప్రాంతాల డెమోగ్రాఫికల్ పరిస్థితుల బట్టి రాజధాని తరహాలో ఐడెంటిటీ ఇవ్వడం వలన అన్ని ప్రాంతాలు గొప్ప పట్టణాలుగా మారుతాయని తెలిపారు. ఇదే విధానంలో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా వెళ్తుందని తెలిపారు. అక్కడికి వచ్చే పరిశ్రమలని జిల్లాల వారీగా ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకి ఉపాధి పెంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇదే విధానం ఏపీలో కూడా అనుసరిస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అన్ని పార్టీలు ఇదే విధానంలో వెళ్లాలని సూచించారు. పరిపాలన ఒకే చోట నుంచి చేస్తూ అనుబంధంగా శాఖలని ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయాలని దీని వలన ప్రజలకి కూడా ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి మార్గం సులభతరం అవుతుందని చెప్పారు.