Janasena BJP Alliance: ఏపీ రాజకీయాలలో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రెండు పార్టీలు పేరుకే పొత్తు పెట్టుకున్న ఈ మూడేళ్ళ కాలంలో కలిసి పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. అయితే ఈ మూడేళ్ళలో పవన్ కళ్యాణ్ మాత్రం జనసేనతో ఒంటరిగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేస్తూ వస్తున్నారు. బీజేపీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చే ప్రయత్నం చేయలేదు. కేంద్రంలో పెద్దలు పవన్ కళ్యాణ్ కి దగ్గరగా ఉన్న ఏపీలో బీజేపీ నేతలు మాత్రం పోరాటాలలో కలిసి వచ్చింది లేదు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పకనే చెప్పేశారు.
వారు మూడేళ్ళలో తమతో కలిసి పోరాటాలు చేసి ఉంటే అసలు వ్యతిరేక ఓటు అనే మాట చెప్పే పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ నేతలపై పవన్ కళ్యాణ్ నేరుగానే విమర్శలు చేయడంతో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఈ ఓటమికి పవన్ కళ్యాణ్ ని వారు కారణంగా చూపిస్తూ ఉండటం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన సహకారం తమకి ఎంత మాత్రం దొరకలేదని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు.
అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్ కళ్యాణ్ సహకారం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంత ఉంది అనేది వారే డిసైడ్ చేసుకోవాలని అన్నారు. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన బీజేపీకి సహకరించలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా పోటీ చేయలేదు. వైసీపీకి ఓటు వేయొద్దు అని మాత్రమే చెప్పారు. ఇక ఏపీ బీజేపీ నేతలు జనసేనాని మీద నేరుగానే విమర్శలు చేస్తూ తమతో పొత్తు వారికి ఇష్టం లేనట్లు ఉంది అంటున్నారు. అయితే పోరాటాలలో బీజేపీ కలిసి రాలేదు కాబట్టి మేము ఎన్నికలలో వారికి మద్దతు ఇవ్వలేదు అనేది జనసేన నాయకుల వాదన.
ఈ నేపధ్యంలో ఈ రెండు పార్టీల మధ్య బంధం తెగిపోయే దిశలో ఉందనే మాట వినిపిస్తుంది. అయితే సోము వీర్రాజు మాత్రం తమ బంధం తెగిపోయే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మరి ఈ రెండు పార్టీల మధ్య పొట్టు ముందుకి కొనసాగుతుందా లేదా అనేది భవిష్యత్తులో డిసైడ్ అయిపోవచ్చు. బీజేపీ నాయకులు కూడా గతంలో మాదిరిగా జనసేనని ఎక్కువగా వోన్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదనే మాట వినిపిస్తుంది.