Vizag Capital: వైసీపీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమరావతి రాజధానికి మంగళం పాడేసి మూడు రాజధానుల ఎజెండాని తెరపైకి తీసుకొచ్చారు. విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎన్నికల ముందు అమరావతికి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ రాజధాని అంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక గత రెండేళ్ళ నుంచి అయితే రెండు నెలల్లో విశాఖ నుంచి పరిపాలన మొదలు పెడతాం అంటూ వైసీపీ నాయకులు చెబుతూనే ఉన్నారు.`ముఖ్యమంత్రి జగన్ సైతం ఎప్పటికప్పుడు విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేస్తామంటూ చెబుతున్నారు. అమరావతిని కేవలం అసెంబ్లీ సమావేశాలకి మాత్రమే పరిమితం చేసి ఇక విశాఖను పూర్తి స్థాయిలో రాజధానిగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు.
పెట్టుబడుల సదస్సులో కూడా విశాఖని రాజధానిగా ప్రాజెక్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాకుళంలో జరిగిన సభలో సెప్టెంబర్ లో తాను విశాఖలో కాపురం పెడతానని జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి పాలన కూడా విశాఖ నుంచి స్టార్ట్ అవుతుందని స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు స్టార్ట్ చేశాయి. అయితే ఇదే మాటని ఇప్పటి పది సార్లు అయిన వైసీపీ నేతలు, జగన్ చెప్పి ఉంటారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో 2024లో మళ్ళీ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల అజెండాతోనే ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు.
ముఖ్యంగా విశాఖ రాజధాని చేయడం ద్వారా ఉత్తరాంద్ర జిల్లాలలో పూర్తి ఆధిక్యం వస్తుందని వైసీపీ లెక్కలు వేసుకుంటుంది. విశాఖ రాజధానికి రాష్ట్ర ప్రజలందరి మద్దతు ఉందని జగన్ నేరుగా ప్రకటించడం విశేషం. ప్రతిపక్షాలు, ప్రకాశం నుంచి గోదావరి జిల్లా వరకు విశాఖ రాజధానిని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో ప్రజలు కూడా విశాఖ రాజధానిగా కొంత ప్రతికూలంగానే ఉన్నారనే మాట వినిపిస్తోంది. అయితే విశాఖ రాజధాని ప్రకటన ద్వారా ప్లస్ అవుతుందని జగన్ భావిస్తున్నారు. అయితే సెప్టెంబర్ లో కాపురం పెడతానని జగన్ చెబుతున్న అది సాధ్యం కాకపోవచ్చనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.