Politics: ఏపీ రాజకీయాలలో వైసీపీ పార్టీతో చక్రం తిప్పుతూ ప్రభుత్వంలో ఉన్న వైఎస్ జగన్ తరహాలోనే తెలంగాణలో అన్నదారిలో వెళ్లి తాను కూడా ముఖ్యమంత్రి కావాలని వైఎస్ షర్మిల భావిస్తుంది. ఇందుకుగాను తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించి చురుకుగా తన రాజకీయ కార్యాచరణతో ముందుకి వెళ్తుంది. రాబోయే ఎన్నికలలో కచ్చితంగా ప్రభావం చూపించే శక్తిగా ఎదగాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారు. దీనికిగాను తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో పాదయాత్రతో ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి తాను కూడా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కావాలని షర్మిల భావిస్తుంది. ఏపీలో అన్న జగన్ కారణంగా ఎలాగూ తనకి అవకాశం లేదు కాబట్టి తెలంగాణని తన ముఖ్యమంత్రి కోరిక నెరవేర్చుకోవడానికి వేదికగా మార్చుకుంది. అందులో భాగంగానే తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. వైఎస్ఆర్ ని అభిమానించే అందరూ తనతో పాటు తెలంగాణలో నడుస్తారని షర్మిల భావించారు.
అయితే అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాని, టీఆర్ఎస్ నుంచి కాని వైఎస్ఆర్ విధేయులుగా ఉన్న ఎవరూ కూడా షర్మిలతో నడవడం లేదు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో సెకండ్ కేటగిరీ లీడర్స్ గా ఉంటూ భవిష్యత్తులో అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నవారు షర్మిల వెంట నడుస్తున్నారు. ఆమె పాదయాత్రకి కూడా తెలంగాణ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. తెలంగాణలో రాజకీయాలు ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే తిరుగుతున్నాయి. అయితే షర్మిల కారణంగా క్రిస్టియన్ ఓటు బ్యాంకుతో పాటు, వైఎస్ఆర్ ని అభిమానించే వారి ద్వారా గత రెండు ఎన్నికలలో టీఆర్ఎస్ కి పడ్డ ఓటు బ్యాంకు మొత్తం దూరం అవుతుందని బీజేపీ భావిస్తుంది. ఇది తమని అనుకూలించే అంశం అని వెనకుండి బీజేపీ షర్మిలని నడిపిస్తుంది అనే ప్రచారం ఉంది. టీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే రకమైన విమర్శలు చేస్తున్నారు.
అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. బీజేపీ పార్టీ ఎదుగుదలని అడ్డుకోవడంతో పాటు, ఆ పార్టీకి పెరుగుతున్న జనాదరణని తగ్గించాలంటే షర్మిలపై మీడియా ఫోకస్ పడే విధంగా చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా వ్యూహాత్మకంగా బండి సంజయ్ పాదయాత్ర చేయబోయే రోజే షర్మిలపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎటాక్ చేయడం, తరువాత షర్మిల ప్రగతి భవన్ ముట్టడించడానికి సిద్ధ పడటం. పోలీసులు అడ్డుకొని ఆమెని అరెస్ట్ చేయడం వంటి సంఘటనలతో పొలిటికల్ డైవర్షన్ అంతా షర్మిల వైపు వెళ్ళిపోయింది. దీంతో బీజేపీపై మీడియా ఫోకస్ అంతా తగ్గిపోయింది. అన్ని చానల్స్ లో ప్రధానంగా షర్మిలనే కనిపిస్తూ ఉండటం విశేషం.
కేవలం బీజేపీని ప్రభావాన్ని తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగానే టీఆర్ఎస్ వ్యూహాత్మకం గా షర్మిలని ఉపయోగించుకుంటుంది అని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. కవిత, షర్మిల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే టీఆర్ఎస్ ఫోకస్ అంతా ఇప్పుడు ఆమెని హైలైట్ చేయడం మీదనే ఉందనే టాక్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో షర్మిలని ఉపయోగించుకొని ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ రాజకీయ వ్యూహాలు అమలు చేసుకుంటున్నాయి. మరి రానున్న ఎన్నికలలో ఆమె ప్రభావం ఏ పార్టీ మీద ఉంటుందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.