Political: జిల్లాల వారీగా జనవాణి ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయ క్షేత్రంలోకి చురుకుగా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రతి నెల ఏదో ఒక రూపంలో ప్రజలలో ఉండాలని నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు కనిపిస్తుంది. వైజాగ్ ఇష్యూ తర్వాత మంగళగిరి వేదికగా పీఏసీ మీటింగ్ ని పార్టీ ప్రతినిధులని పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఈ సమావేశంలో వైజాగ్ లో అక్రమ కేసులలో అరెస్ట్ చేయబడ్డవారికి ముందుగా అభినందిస్తూ సన్మానం చేశారు.
ఇక అనంతరం పార్టీ తీర్మానంలో భాగంగా జనవాణి కార్యక్రమాలని 26 జిల్లాలలో కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున వారి సమస్యలు చెప్పుకోవడానికి ముందుకి వస్తున్న నేపధ్యంలో జిల్లాల వారీగా ఈ జనవాణి కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధం అయినట్లు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇక ఈ సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఎప్పటిలాగే విమర్శలు చేశారు. నియంతృత్వం పెరిగిపోయి, ప్రజలని భయపెట్టి, వారి స్వేచ్ఛని హరించే విధంగా నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. అరాచక శక్తులు అధికారంలో ఉంటే ప్రజలు అంధకారంలోకి వెళ్ళిపోతారని, వారి తరుపున జనసేన నిరంతర పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.
అలాగే రాజకీయాలంటే తనకేమీ సరదా కాదని, పోలీసులు చట్టాలకు లోబడి పనిచేయాలని, అలా కాకుండా అధికారంలో ఉన్న వారి కోసం పని చేయకూడదని హితవు పలికారు. విశాఖ సంఘటనని ఈ సమావేశంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఉటంకిస్తూ వైసీపీ అరాచకం సృష్టిస్తుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక విశాఖ సంఘటన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ లో కొంత ఎనర్జీ వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో పూర్తిస్థాయిలో రాజకీయ కార్యాచరణని సిద్ధం చేసుకొని ప్రజలకి మరింత చేరువ అయ్యేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు.
అలాగే కాపు నాయకులు అందరిని ఒకే వేదికపై తీసుకొచ్చి జనసేన పార్టీకి అండగా ఉండే విధంగా వెనక నుండి నాయకులతో సామాజిక సమీకరణాలు కూడా నడుపుతున్నారని టాక్ ఉంది. మరో వైపు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెనుక లేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి వైసీపీ కాపునేతలు సిద్ధం అవుతున్నారు. ఓ వైపు బీసీ సంఘం సమావేశాలు నిర్వహిస్తూ ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకు పోకుండా జాగ్రత్తలు పడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.