North Andhra: అధికార పార్టీ వైసీపీలో రోజురోజుకీ అసమతి సెగలు ఎక్కువైపోతున్నాయి. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్లీ తమ స్థానాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసిపి అధిష్టానం వారి గెలుపు అవకాశాలను చూసి ఒక అంచనాకు వచ్చిన తర్వాత టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు రావని ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పటికే వారు పక్క చూపులు చూడడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రలో కూడా వైసీపీలో అసమ్మతి సెగలు అంతర్గతంగా రాజుకుంటున్నాయనే మాట వినిపిస్తుంది. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.
ఆయన నిలబెట్టిన ఎమ్మెల్యేలు అందరు కూడా గెలుస్తూ ఉంటారు. సామాజిక సమీకరణలు కంటే గ్రామీణ స్థాయిలో బలమైన నాయకత్వాన్ని తనకు సపోర్ట్ గా నిలుపుకోవడం ద్వారా విజయనగరం జిల్లాపై సత్యనారాయణ పట్టు సాధించారు. అయితే ఇప్పుడు బొత్స ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయని తెలుస్తుంది. బొత్స సత్యనారాయణ జిల్లాలో ప్రధాన బలం అతని మేనల్లుడు చిన్న శ్రీను. గ్రౌండ్ లెవెల్ క్యాడర్ తో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్న చిన్న శ్రీను ప్రస్తుతం బొత్స సత్యనారాయణతో విభేదించి దూరమైనట్లుగా తెలుస్తుంది. తాజాగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడికి చిన్న శ్రీను తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. దీంతో వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడింది.
అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈసారి బడుకొండ స్థానంలో తన సోదరుడు లక్ష్మణరావుని ఎమ్మెల్యేగా నిలబెట్టలని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారు. ఇప్పటికే బొత్స లక్ష్మణరావు నెల్లిమర్ల నియోజకవర్గంలో బడుకొండ అప్పలనాయుడుకి వ్యతిరేకంగా తన రాజకీయ కార్యాచరణను అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో బడుకొండ అప్పలనాయుడుకి వ్యతిరేకంగా కొంతమంది సర్పంచ్ లని బరిలోకి దించారు. తర్వాత సమయంలో ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు బొత్స సత్యనారాయణ ఉద్దేశిస్తూ మీ తమ్ముడు నా నియోజకవర్గంలో ఇబ్బంది పెడుతున్నాడు.
మీరు కంట్రోల్ చేయకపోతే నేను ఎంత దూరమైన వెళ్తా అంటూ హెచ్చరించారు. అప్పటినుంచి బడుకొండ అప్పలనాయుడుని బొత్స సత్యనారాయణ దూరం పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో బలమైన కార్యకర్తల బలం ఉన్న పెనుమత్స సూర్యనారాయణ రాజు స్థానంలో ఈసారి కందుల రఘుబాబుకి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించే ప్రయత్నం బొత్స చేస్తున్నారు. అదే జరిగితే పెనుమత్స వర్గం కూడా వైసిపికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా విజయనగరంలో ఒకే కుటుంబం రాజకీయ ఆధిపత్య పోరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయ అంశంగా మారింది.