Child Care: ఈ మధ్యకాలంలో పిల్లల్లో మొండి వైఖరి ఎక్కువైంది. పెద్దల మాట వినాలి అన్నది ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి నెలకొంటోంది. వద్దన్న పనిని కావాలని చేయడం, చేయమన్న పనిని వంద సార్లు చెప్పినా చేయకపోవడం, చెప్పిన మాట వినకుండా మొండిగా వారికి నచ్చినట్లు వారు బిహేవ్ చేయడం, పెద్దలను ఎదురించడం, ఇష్టం వచ్చినట్లు చేయి చేసుకోవడం, పిల్లలతోనూ మొండిగానే బిహేవ్ చేయడం, చదువు పట్ల శ్రద్ధ చూపించకపోవడం, ఆఖరికి అన్నం తినే దగ్గర కూడా పేచీ పెడుతుండటం చాలా వరకు సందర్భాల్లో చూస్తూనే ఉంటున్నాము. ఈ మొండి వైఖరికి ఎలా సెలవు పలకాలి అన్ని విషయాన్ని కాస్త పక్కన పెడితే అసలు పిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారన్న విషయాన్ని కాస్త పరిశీలిద్దాం.
ఆర్ధిక అవసరాల నిమిత్తం ఇంట్లో తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. మోట్రో సిటీల్లో ఈ సిచువేషన్ ఎక్కువగా ఉంటుంది. వీరు పిల్లల పై వారి ఆలనా పాలనపై పెద్దగా దృష్టిపెట్టలేకపోతున్నారు. ఉదయం పరుగో పరుగు అంటూ ఆఫీసులకు వెళ్లడం సాయంత్రానికి చిరాకు పడుతు ఇంటి తిరిగిరావడం పిల్లలు దగ్గరికి వచ్చినా వారిపై తమ కోపాన్ని చూపడం, వారి అల్లరి భరించలేక ఫోన్‌లు వారికి ఇవ్వడం వంటివి చేస్తున్నారు. నిజానికి అక్కడే అసలు మోసం మొదలువుతోంది. పెద్దలు ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటుంటారు మా వాడు ఐదేళ్లకే ఫోన్ మొత్తం తిరగేస్తాడు, అవునా మా వాడు ఇంకా చురుకండి గేమ్స్ అన్నీ డౌన్ లోడ్ చేస్తాడు అని ఎంతో సరదాగా ముచ్చటగా చెప్పుకుంటుంటారు. నిజానికి వాడు ఫోన్ లో ఆడే ఆటలు చూసే వీడియోలు ఏమిటో పెద్దలు గుర్తించలేకపోతున్నారు.
ఈ మధ్యకాలంలో కొన్ని ఆటలు ఎంతో హింసాత్మకంగా ఉంటున్నాయి. గన్నులతో పేల్చుకోవడం, బాంబులతో ఫైటింగ్ చేయడం, చంపుకోవడాలు, నరుక్కోవడాలు వీటితోనే గేమ్స్ ను డిజైన్ చేస్తున్నారు. లేలేత మనస్సు కలిగిన పిల్లలు వీటికి బానిసలవుతూ వారు చిన్నవయస్సులోనే కోపానికి, మొండితనానికి అలవాటు పడుతున్నారు.
ఇదొక్కటే కాదు ఇంట్లో వారిని లాలించే పెద్దవారు లేకపోవడం కూడా ఓ రకంగా పిల్లల్లో ఈ మొండితనానికి కారణంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులిద్దరూ ఆఫీసులకు వెళితే ఇంట్లో పెద్దవారు ఉంటే ఓ ధైర్యంగా ఉంటుంది. కానీ చాలా మంది సిటీల్లో ఉండే వారు వారి తల్లిదండ్రులు పల్లెల్లో ఉండిపోతున్నారు. పల్లె వాతావరణానికి అలవాటు పడిన వారు సిటీకి రాలేకపోతుంటే, కొంత మంది ఎక్కడ పిల్లల బాధ్యతలు మా మీ పడతాయేమోనని భయంతో పిల్లల దగ్గరికి రాలేకపోతున్నారు. నిజానికి పాతకాలంలో పిల్లలు తల్లిదండ్రుల కంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల దగ్గరే ఎక్కువగా ఉండేవారు. వారికి విద్యా బుద్ధుల నుంచి సంస్కారం వరకు అన్నింటిపైన వివిధ రకాలుగా అవగాహన పరిచేవారు. ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు అమ్మమ్మల, నానమ్మల, తాతల ఒళ్లో పెరిగిన వారే. కానీ నేడు వీరిద్దరి ప్రేమ పిల్లలకు దూరమవుతోంది.
ప్రధానంగా పిల్లలకు తల్లిదండ్రుల సాన్నిహిత్యం ఏ విధంగా అవసరమో అదే విధం గా నాయనమ్మ, అమ్మమ్మ, తాతల తో ఇంటరాక్షన్ కూడా చాలా అవసరం అని గుర్తించాల్సిన విషయం. తల్లిదండ్రులకు పిల్లలకు, అమ్మమ్మలు, నాయనమ్మ లతో జరిగే ఇంటరాక్షన్ వేరేలా ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులతో కంటే వారితోనే ఎంతో చనువుగా ఉంటారు. మనవళ్లతో పెద్దలు కూడా అంతే అటాచ్‌మెంట్‌ను పెంచుకుంటుంటారు. నిజానికి వీరిద్దరి ఆలోచనలు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల పిల్లలు వారి మాటలను వినగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు వీలైనంత వరకు ఇంట్లో పెద్దవారు ఉండే విధంగా చూసుకోవాలి. దూరంగా ఉంటే కాస్త సమయాన్ని కుదుర్చుకుని పిల్లలను వారి దగ్గరికి తీసుకువెళ్లాలి. పెద్దలు కూడా వారిని పెంచడం వారితో ఆడుకోవడం శ్రమ అని అనుకోకుండా మీరు చిన్నప్పుడు మీ పిల్లలలో గడపాలనుకున్న విధంగా వారితో గడపండి, కథలు చెప్పడం, ఆటలు ఆడటం, లేదా వారిలోని నైపుణ్యాన్ని పిల్లలకు అందించడం వల్ల వారి పరిపక్వత వస్తుంది. ఎలాంటి యంత్రాల జోలికి వెళ్లకుండా జాలీగా సమయం గడుపుతారు.
ఇక ఇదే అసలు మ్యాటర్ చాలా వరకు కుటుంబాల్లో తల్లిదండ్రులు చీటికి మాటికి కొట్లాడుకుంటుంటారు. చిన్న పిల్లల ముందే వివక్షను కోల్పోయి బిహేవ్ చేస్తుంటారు. ఇద్దరూ గట్టి గట్టిగా అరుచుకుంటూ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉంటారు. సర్దుకుపోయే మనస్తత్వం లేక చాలా కుటుంబాలు చెల్లాచెదురైన సంఘటనలు లేకపోలేదు. ఈ సంఘటనలు పిల్లలపైన విపరీతంగా ప్రభావితం చేస్తుంటాయి. అమ్మానాన్నలు ఇంత మొండిగా కొట్టుకుంటూ ఉంటుంటే ఒకరిపై ఒకరు కోపం చూపుకుంటుంటే పిల్లలు కూడా అవే బుద్ధులను నేర్చుకుంటుం టారు. ఇలాంటి తల్లిదండ్రులు పిల్లలు మాత్రం మేము చెప్పినట్లు వినాలి అనడంలో ఎలాంటి న్యాయం లేదు. ముందుగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. పిల్లలు మాట వినడం లేదంటే లోపం ఎక్కడుందో గుర్తించాలి. ఏదైనా తగాదాలు ఉంటే మీరిద్దరు పర్సనల్ గా చూసుకోవాలి. చిన్నపిల్లల ముందు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే అసలుకే ఎసరు వస్తుంది. వారిలో కోపం, మొండితనమే కాదు హింసాత్మక ఆలోచనలు రావడానికి పరోక్షంగా తల్లిదండ్రులే కారణంగా మిగులుతారు.
మరి పిల్లల్లో ఇలాంటి స్వభావం వచ్చిందని గుర్తించడం ఎలా అని అందరికి వచ్చే మొదటి ప్రశ్న. దానికి ఓ సొల్యూషన్ ఉంది. అదేమిటంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, చదువును పక్కన పెట్టి తోటి వారితో గొడవలు పడటం, చీటికి మాటికి మొండిగా బిహేవ్ చేయడం వంటి సిమ్‌టమ్స్ ఉంటే మీ పిల్లలు మీ చేయి దాటుతున్నారని గుర్తించండి. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ఎంతో సహనం తో వారితో సమయాన్ని గడపాల్సిన అవసరం ఉంటుంది. ఊరికే వారిని తిట్టడం, కసురుకోవడం మానేసి.
ప్రేమగా నాలుగు లాలించే మాటలు చెప్పండి. వారి సమస్యేమిటో తెలుసుకోండి . కుదిరితే సలహా ఇవ్వడం. లేదంటే బుచ్చగించే ప్రయత్నం చేయండి అంతే కానీ సంపాదించే పనిలో పడి పిల్లల బాగోగులను పక్కన పెట్టడం వల్ల వారి భవిష్యత్తు తారుమారయ్యే ప్రమాదం ఉంది. రోజులో గంట వారితో గడపండి. వారు చేసే తప్పులు వెతికే పని మానేయాలి. వారి ఇష్టాలు ఏమిటో తెలుసుకోవాలి. ఫ్రెండ్స్‌లా వారితో కలవాలి. ఆడుకోవాలి. వారితోనే ఉండాలి. ఇలా చేయడం వల్ల పిల్లలో చాలావరకు మార్పులను చూడవచ్చు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చు.