Varalakshmi: వరలక్ష్మి వ్రతం ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవడం వల్ల సకల సంపదలు కలుగుతాయని అలాగే తమ జీవితంలో ఎన్నో సుఖసంతోషాలు ఉంటాయని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు అందుకే మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రత ఏర్పాట్లను ముందు రోజు నుంచే ప్రారంభిస్తూ ఉంటారు. ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసి పూజించడం ఎంతో మంచిది కానీ మనం తెలిసి తెలియక వరలక్ష్మి వ్రతం రోజు చేసే కొన్ని తప్పుల కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
వరలక్ష్మి వ్రతం రోజు ఏ విధమైనటువంటి తప్పులు చేయకూడదు అనే విషయానికి వస్తే… ముందుగా వరలక్ష్మీ వ్రతం చేసేవారు వ్రతానికి మూడు రోజుల ముందు నుంచి మాంసాహారం ముట్టుకోకూడదు అలాగే నేలపై పడుకోవడం ఎంతో మంచిది. అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఉదయం 10 గంటల లోపు పూర్తి చేయాలి. అలాగే 12 గంటల తర్వాత పూజ అసలు చేయకూడదు. ఇక పూజకు ఉపయోగించే పువ్వుల విషయానికి వస్తే ముళ్ళు ఉన్న చెట్లనుంచి వికసించిన పువ్వులను వాడకూడదు. వరలక్ష్మీ వ్రతం రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ పువ్వులను ఉపయోగించరాదు.
ఇక పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి పొరపాటున కూడా ఇనుప వస్తువులను ఉపయోగించకూడదు అలాగే గాజు వస్తువులు కింద పగలకుండా చూసుకోవాలి. ఇక పూజ చేసిన రోజు పొరపాటున ఎవరితోనో గొడవలు పడటం పోట్లాటకు పోవడం జరగకూడదు. ఇక అమ్మవారికి నైవేద్యంగా చేసే ప్రసాదాల విషయానికి వస్తే మనం ఇంట్లో ఉపయోగించకుండా ఉన్న పాత గిన్నెలలో అసలు నైవేద్యం చేయకూడదు. ఎంగిలి చేసిన ఆహార పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించకూడదు.