Politics: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రస్థానం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ తరుపున ఏపీని పరిపాలించారు. టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలు పెడితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సేవలు అందించిన వారే ఉన్నారు. ఓ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ అనేది మర్రిచెట్టు లాంటిది. అలాంటి మహావృక్షం కూలిపోతుందని ఏ ఒక్కరు అనుకోని ఉండరు. కాని కచ్చితంగా ఎనిమిదేళ్ళలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ముగింపు దశకి వచ్చేస్తుందని ఏ రాజకీయ నాయకుడు కూడా ఊహించి ఉండరు. కాని అంతా మారిపోయింది. చేజేతులా తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని ఆ పార్టీ పెద్దలే నాశనం చేసారని కచ్చితంగా చెప్పొచ్చు.
తెలుగు రాజకీయాలలో ఎన్టీఆర్ ప్రయాణం మొదలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే వారే లేరు. అయితే ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ పార్టీని డబుల్ డిజిట్ నెంబర్ కి ఏపీ రాజకీయాలలో పరిమితం చేశారు. తరువాత చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు దూరం చేశాడు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఏపీలో భవిష్యత్తు లేదని అనుకున్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ ఏపీలో ఆ పార్టీకి జీవం పోశారు. పాదయాత్రతో ఏపీ ప్రజల మనసుని గెలుచుకొని టీడీపీ పార్టీని ఓడించి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న కూడా రెండో సారి మళ్ళీ తన రాజకీయ వ్యూహాలతో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చారు. అతని మరణం తర్వాత ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
వైఎస్ఆర్ స్థాయిలో ప్రజలని ప్రభావితం చేసే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేయడం, అది తీవ్రతరం అవ్వడం జరిగింది. అదే సమయంలో వైఎస్ఆర్ వారసుడిగా ఉన్న జగన్ విధేయతని అనుమానించి, అవమానించింది. దీంతో అతను కాంగ్రెస్ పార్టీని వీడి సొంతగా పార్టీ పెట్టుకున్నాడు. ఇక తెలుగు రాజకీయాలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెట్టిన విభజన కుంపటి ఆ పార్టీని భూస్థాపితం చేయడానికి పునాదిగా మారింది. దీంతో విభజన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోయింది. కనీసం ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించలేకపోయారు. దీంతో నూతన ఏపీలో కాంగ్రెస్ ప్రస్థానం ముగిసిపోయింది.
మళ్ళీ తేరుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. ఇక ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం ద్వారా ఇక్కడ అధికారంలోకి రావొచ్చు అని కలలు కన్నా అవి కూడా తీరని ఆశలుగానే కాంగ్రెస్ పార్టీకి మారాయి. ప్రత్యేక తెలంగాణ క్రెడిట్ అంతా కేసీఆర్ తీసుకుపోయాడు. అతనికి ప్రజలు పట్టం కట్టారు. ఇక కేసీఆర్ ని ఎదుర్కొనే బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం, ఎప్పటిలాగే ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాలు వెరసి తెలంగాణ ప్రజలకి కూడా కాంగ్రెస్ దూరం అవుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఇప్పుడు బీజేపీ తీసుకుంటుంది.
కేసీఆర్ ని బలంగా ఎదుర్కొంటూ బలమైన శక్తిగా బీజేపీ మారుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరారు. ఇతని చేరికతో భవిష్యత్తులో మరింత మంది కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీకి వలస వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రస్థానం అంతిమ దశకి చేరుకుంటున్నట్లే. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో వటవృక్షం లాంటి ఆ పార్టీ భవిష్యత్తుని ఆ పార్టీ పెద్దలే సమూలంగా నాశనం చేసారని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్ధమవుతుంది.