Gannavaram Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ రోజు రోజుకి ప్రతిపక్షాలని లక్ష్యంగా చేసుకొని వారిని ఎన్ని విధాలుగా ఛాన్స్ దొరికితే అన్ని విధాలుగా అణచివేసే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. తాజాగా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి కారుని దగ్ధం చేశారు. ఈ దాడి ఘటనలో పోలీసులు తిరిగి టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనే కేసులు పెట్టారనేది టీడీపీ నేతల వాదన. వైసీపీ పార్టీనాయకులకి కొమ్ము కాస్తూ అంతమంది వచ్చి విద్వంసం చేసిన అసలు కేసులే నమోదు చేయలేదని విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ నేతలు వల్లభనేని వంశీని లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడి చేస్తున్నారు.
అలాగే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సైకో సీఎం నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఉగ్రవాదులుగా తయారయ్యారు అంటూ కామెంట్స్ చేశారు. ఇలాంటి విద్వంసం రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఉంటే అసలు రాష్ట్రంలో వైసీపీ తిరగగలిగేది కాదని అన్నారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ వంశీకి దమ్ముంటే విజయవాడ సెంటర్ కి రావాలని తన రాజకీయ చరిత్ర ఏంటో బయటపెడతా అని అన్నారు.
ఎంత మందిని చంపించాడో, ఎన్ని ఘోరాలు చేసాడో రుజువు చేస్తానని అన్నారు. ఇక బుడ్డా వెంకన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వంశీ కూడా రియాక్ట్ అయ్యారు. తనకి విజయవాడ రావాల్సిన అవసరం లేదని దమ్ముంటే గన్నవరం వచ్చి ఇక్కడ తేల్చుకోవాలని ప్రతి సవాల్ చేశారు. ఇక ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు కూడా గన్నవరం ఘటనపై రియాక్ట్ అయ్యారు.