Surya Grahanam: హిందూ సనాతన ధర్మంలో గ్రహాలు, నక్షత్రాల స్థితిగతులు, ఆయా రాశులలోకి నక్షత్రాలు ప్రవేశించే గడియలు బట్టి శుభ సమయాలు, మంచి రోజులు అనేవి నిర్ణయించబడతాయి. అలాగే శుభ ఘడియలు లేదంటే శుభ తిధుల్లో ఏవైనా కార్యాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్ముతారు. అశుభ ఘడియలు ఉన్న సమయంలో ఎలాంటి కార్యం చేసిన కూడా చెడు ఫలితం వస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. అలాగే సూర్య చంద్ర గ్రహణాలు కూడా సనాతన ధర్మంలో భాగంగా ఉన్నాయి. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు గర్భంతో ఉన్నవారు బయటకు రాకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే సూర్యగ్రహణం ఏర్పడే సమయం బట్టి కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయని, మరి కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఉంటాయని నమ్ముతారు.
ఇదిలా ఉంటే హిందూ క్యాలెండర్ ఏప్రిల్ 20న మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏప్రిల్ 14న మీన రాశి నుంచి మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. ఏప్రిల్ 20న ఏర్పడే సూర్యగ్రహణం ఏడు రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తాయని పండితులు చెబుతున్నారు. సూర్యసంచారం కుంభరాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలను సూచిస్తుంది. సూర్య గ్రహణం తర్వాత ఈ రాశి వ్యక్తుల జీవితాలలో వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ధనస్సు రాశిలో సూర్య సంచారం వలన ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి మంచి సంపాదన, ఇప్పటివరకు ఉన్న ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం వంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 14 తర్వాత ఆరోగ్యపరమైన వృద్ధి, జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపే సమయం దొరుకుతుంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. ఇక సింహరాశిలో సూర్య సంచారం కారణంగా ఉద్యోగాలలో ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వ్యాపార విస్తరణకు కూడా శుభ సమయం. కర్కాటక రాశిలో సూర్యసంచారంతో ఊహించని ధన లాభాలు వస్తాయి. డబ్బు ఆదా పెరుగుతుంది.
సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మిధున రాశిలో సూర్య సంచార ప్రభావం కారణంగా ఉద్యోగాలలో ఉన్నత స్థానాలకు వెళ్తారు. సమాజంలో గౌరవం, ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కల్పిస్తుంది. మేషరాశిలో సూర్య సంచారం వ్యక్తిగత వృత్తి జీవితంలో శుభ ఫలితాలను సూచిస్తుంది. వ్యాపారులకు శుభప్రదమైన సంవత్సరంగా ఉంది. ఉద్యోగాలకు కొత్త అవకాశాలు వస్తాయి.