Health: ప్రస్తుతం మన జీవనశైలిలో ఉదయాన్నే టిఫిన్ చేయడం అనేది అలవాటుగా మారిపోయింది. రకరకాల టిఫిన్స్ తినడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పదేళ్ళ వెనక్కి వెళ్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉదయాన్ని చద్దన్నం ఉల్లిపాయ తిని రైతులు వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిపోయేవారు. ఇక ఆ చద్దికూడుతోనే మధ్యాహ్నం వరకు కష్టపడేవారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేవారు. రాత్రి మిగిలిపోయిన అన్నంలో గంజి వేసి వదిలేస్తే అది ఉదయానికి భాగా పులుస్తుంది. అలా పులిచిన అన్నాన్ని చద్ది అన్నం అంటారు. ఈ చద్ది అన్నం ప్రజల జీవన శైలిలో భాగంగా ఉండేది. ఇప్పటి గ్రామీణ ప్రాంతాలలో పెద్దవాళ్ళు టిఫిన్స్ కంటే చద్దన్నం తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలా చద్దన్నం తినడం వలన వారు ఇప్పటికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతున్నారు.
అయితే ఇప్పుడు టిఫిన్స్ చేస్తున్నవారిలో ఇమ్యూనిటీ పవర్ క్రమంగా తగ్గిపోయి 40 ఏళ్ళ నుంచి రకరకాల రోగాల బారిన పడుతున్నారు. చద్దన్నం అంటే చాలా చిన్న చూపుగా చూసేవారు ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే మరల దాని ప్రాధాన్యతని ప్రజలు గుర్తించ కలుగుతున్నారు. తాజాగా అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంపై చాలా వాస్తవాలు బయటపెట్టింది. పులిసిన అన్నంలో ఐరన్, పొటాషియమ్, కాల్షియం లాంటి పోషకాల అధిక మోతాదులో ఉంటాయని తెలిపారు. అప్పుడే వండుకునే అన్నంలో కంటే దానిని గంజిలో వేసి పులిసిన తర్వాత ఐరన్ బీ6, బీ12 విటమిన్ లు ఎక్కువగా లభిస్తాయని తెలిపారు.
ఇక చద్దన్నం తినడం వలన వ్యాధినిరోధక శక్తి శరీరం లో పెరుగుతుందని తెలిపారు. అలాగే శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుందని పేర్కొన్నారు. అలాగే ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఒంటికి నీరసం ఆవహించదని , శరీరంలో వ్యర్ధాలని చద్దన్నం బయటకి పంపిస్తుంది అని తెలిపారు. అలాగే ఎదిగే వయస్సులో పిల్లలని కూడా చద్దన్నం పోషకాహారంగా అందిస్తే మంచింది చెబుతున్నారు. అలాగే బరువు తగ్గించడంలో కూడా చద్దన్నం ఎంతో అద్భుతంగా పని చేస్తుందని తెలిపారు.