Election Commission : భారత ఎలక్షన్ కమిషన్ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. మిజోరాంలో నవంబర్ 7, మధ్యప్రదేశ్ లో నవంబర్ 17, రాజస్థాన్ లో నవంబర్ 23న ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఛత్తీస్ గఢ్లో రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. దీంతో నవంబర్ 7, 17న ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్ జరుగుతాయి. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ తేదీలు వేరైనప్పటికీ డిసెంబర్ 3నే అన్ని రాష్ట్రాల కౌంటింగ్ ఉండనుంది.
ఎలక్షన్ కమిషన్ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం 679 స్థానాలకు ఈ ఎలక్షన్స్ జరగనున్నాయి. తెలంగాణలో 119, రాజస్థాన్ – 200, మధ్యప్రదేశ్ – 230, ఛత్తీస్‌గఢ్ – 90, మిజోరాం – 40 స్థానాలకు ఎలక్షన్లు జరుగుతాయని ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల్లో భాగంగా 5 రాష్ట్రాల్లోని మత్తం 16.14 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హాక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎలక్షన్లలో కొత్తగా 60లక్షల మంది ఓటర్లు చేరారు. వీరు మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎలక్షన్ల కోసం ఈసీ మొత్తం 1.77 లక్షల పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 3న రిలీజ్ కానుంది. నోటిఫికేసన్ వచ్చిన వెంటనే నవంబర్ 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం నవంబర్ 13న నామినేషన్ల వెరిఫికేషన్ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు ఈసీ గడువు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. దీంతో తెలంగాణలో 3.17 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు ఉపయోగించుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. అన్నీ పార్టీలు ఎలక్షన్లలో గెలుపే లక్ష్యంగా పావులు కదపుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే 115 స్థానాల్లో తమ క్యాండిడేట్లను అనౌన్స్ చేసింది. ఇక కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థుల వేటలోనే తలమునకలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైన అధికారాన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకే తమ అభ్యర్థుల సెలక్షన్లలో సరికొత్త విధానం పాటిస్తోంది. అయితే ఆశావాహులు అప్లికేషన్లు పెట్టుకుని నెల దాటుతున్నా ఇంకా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఇంకా ముగియలేదు.