TS Politics: తెలంగాణలో రాజకీయాలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ, జనసేన, తెలుగుదేశం మధ్య నడవబోతున్నాయి. వీటిలో ప్రధాన పోటీ మాత్రం ఈ ఈసారి బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ ఎన్నడూ లేనంత బలంగా తెలంగాణలో ఈ సారి ఉంది. స్ట్రాంగ్ క్యాడర్ ని కూడా సిద్ధం చేసుకుంది. ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రావాలని బలంగా భావిస్తుంది. దీనికోసం కేంద్రం స్థాయిలో ఉన్న జాతీయ నాయకులు కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టడం విశేషం. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణలో ఎలాగూ మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని నమ్ముతుంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో బలం పుంజుకొని బీజేపీని బలంగా ఎదుర్కోవడానికి కేసీఆర్ వ్యూహాలు వేస్తున్నారు.
ఈ నేపధ్యంలో తెలంగాణలో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. ప్రధాన పార్టీలు అన్ని కూడా ఎన్నికలకి సిద్ధం అవుతున్నాయి. నిజానికి ఇంకా తెలంగాణలో ఎన్నికలు రావడానికి ఏడాది సమయం ఉంది. ఐదేళ్ళ లెక్క చూసుకుంటే వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగాలి. అయితే ప్రస్తుతం పరిణామాలు చూసుకుంటే ముందస్తు ఎన్నికలు వచ్చేలా ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సారి కేసీఆర్ ముందస్తుకి వెళ్లకున్నా కూడా కేంద్రం ఒత్తిడితో ఎన్నికల కమిషన్ తన పవర్ ని ఉపయోగించుకొని ముందస్తు ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది.
దీనికి కారణం ఈ మధ్య తరుచుగా బీజేపీ నాయకులు మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయని క్యాడర్ ని దిశానిర్దేశ్యం చేస్తూ ఉండటమే అని తెలుస్తుంది. బీజేపీ నాయకులు ముందస్తు ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. కర్ణాటకతో పాటు, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎన్నికల కమిషన్ ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ఎవరి వ్యూహాలతో వారు సిద్ధం అవుతున్నారు.