Dasara Movie Review: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో నటించింది. ఇక నాని ధరణి అనే పాత్రలో రఫ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక వీరితో పాటు సూరి అనే మరో పాత్ర కూడా ఉంది. ఈ ముగ్గురు ప్రయాణంగా ఈ మూవీ కథని దర్శకుడు శ్రీకాంత్ ఒదేల ఆవిష్కరించాడు. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల ముంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్విట్టర్ లో ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు. నాని కెరియర్ లో బెస్ట్ మూవీగా ఈ సినిమా ఉండబోతుంది అని చెబుతున్నారు.
ఇక కథలోకి వెళ్తే వీరపల్లి గ్రామంలో ధరణి, సూరి, వెన్నెల మంచి స్నేహితులుగా ఉంటారు. ఇక ధరణి, వెన్నెల ప్రేమించుకుంటూ ఉంటే, సూరి స్థానిక రాజకీయాలలో యువ నాయకుడుగా ఉంటాడు. సూరికి సపోర్ట్ గా ధరణి పాత్ర ఉంటుంది. వీరి మధ్యలోకి షైన్ టామ్ చాకో పాత్రని విలన్ గా పరిచయం చేశాడు. వీరపల్లి గ్రామంలో ఏదో అశాంతి సృష్టించే ప్రయత్నం అతను చేస్తూ ఉంటాడు. ఇక వెన్నెల సూరి కోసం ధరణి స్థానికంగా ఉన్న ఒక పలుకుబడి ఉన్న వ్యక్తితో గొడవ పెట్టుకుంటాడు. ఇక వెన్నెల సూరిని ప్రేమిస్తూ ఉండటంతో ధరణి తన ప్రేమని త్యాగం చేస్తాడు. ఇంతలో రాజకీయ గొడవలలో సూరిని దారుణంగా చంపేస్తారు. దీంతో చిన్నప్పటి నుంచి తన అన్నలా భావించే సూరిని ఎవరో చంపడంతో వారిపై పగ తీర్చుకోవడానికి ధరణి సిద్ధం అవుతాడు. విలన్స్ తో తలపడుతూ తన స్నేహితుడి మరణానికి కారణం అయిన వారిని చంపుకుంటూ వెళ్తాడు. అయితే సూరిని ప్రత్యర్ధులు చంపడానికి కారణం ఏంటి. ధరణి తనను ప్రేమిస్తున్న విషయాన్ని వెన్నెల తెలుసుకుంటుందా… సూరి మరణానికి కారణం అయిన వారిపై ధరణి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే అంశాలు మూవీలో కీలకంగా ఉన్నాయి.
సినిమాలో ధరణి పాత్రలో నాని పరకాయ ప్రవేశం చేసి నటించాడు. స్క్రీన్ పై చూస్తున్నంత సేపు ప్రేక్షకులకి ధరణి మాత్రమే కనిపిస్తాడు. ఇక తన నటనతో ప్రతి ఫ్రేమ్ కి నిండుదనం తీసుకొచ్చాడు. ఇక రఫ్ లుక్ లో మూవీని మరో ఎండ్ లోకి తీసుకొని వెళ్తాడు. యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ లో తన మార్క్ చూపించాడు. ఇక సూరి పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టికి తెలుగులో ఇదే మొదటి సినిమా. అయిన బరువైన పాత్రని చాలా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. ఇక కీర్తి సురేష్ కి మహానటి తర్వాత పూర్తి స్థాయిలో నటనకి స్కోప్ ఉన్న పాత్ర వెన్నెల ద్వారా లభించింది.
ఆమె ఎందుకు మహానటి అనిపించుకుంది ఈ సినిమాలో వెన్నెల పాత్ర చూస్తే తెలుస్తుంది. ఇక సంతోష్ నారాయణన్ సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాని హై లెవల్ లో నిలబెట్టింది. సన్నివేశాలకి తగ్గట్లుగా అతను సంగీతంగా ప్రాణం పోశాడు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఒదేలకి మొదటి సినిమా అయినా కూడా అద్భుతంగా స్క్రీన్ పై తాను చెప్పాలనుకున్న పాయింట్ ని ఆవిష్కరించారు. గురువు సుకుమార్ ప్రభావం శ్రీకాంత్ మీద ఎంత ఉందో దసరా మూవీలో కనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సినిమా నేరేషన్ కాస్తా స్లోగా ఉన్నట్లు అనిపించిన ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ మూవీని నిలబెట్టాయని చెప్పాలి.
ఓవరాల్ గా దసరా సినిమా నాని కెరియర్ లో నెక్స్ట్ లెవల్ సినిమా అని చెప్పాలి. ఎప్పటి వరకు చేసిన సినిమాల ఇమేజ్ ఒక ఎత్తయితే దసరా మూవీతో మరింతగా నాని ఇమేజ్ పెరిగే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తుంది.