Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. భారతదేశపు అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారాన్ని చిరంజీవికి కేంద్ర సర్కార్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ న్యూస్ వారం క్రితమే వచ్చినా అధికారిక ప్రకటన కోసం మీడియా, చిరు ఫ్యాన్స్ అంతా సంయమనం పాటించారు. ఎట్టకేలకు మెగాస్టార్ అభిమానుల కల నెరవేరింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం అయిదుగురికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. మెగాస్టార్ తో పాటు వైజయంతి మాల, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యంకు ఈ పురస్కారాన్ని అందుకునే లిస్టులో ఉన్నారు . అదేవిధంగా కేంద్రం పద్మశ్రీ గౌరవాన్ని మరో పదిహేడు మందికి అందించబోతోంది.
కేంద్ర ప్రభుత్వం తనకి అందించిన పద్మ విభూషణ అవార్డు గురించి చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోలు విడుదల చేసి తన స్పందనను తెలియజేశారు. వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. ” పద్మ విభీషణ్ వచ్చిందని తెలిసిన వెంటనే ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. మన దేశంలోనే రెండో అత్యున్నతమైన పురస్కారం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా నన్ను అన్నయ్యలా భావించి, సొంత మనిషిలా నన్ను ఓ బిడ్డలా భవించే ప్రజల ఆశీస్సులు, నా కుటుంబాన్ని సపోర్ట్, లక్షలాది మంది అభిమానుల ప్రేమ అభిమానం కారణంగానే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. మీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను నాకు వచ్చిన ఈ పురస్కారం, ఈ గౌరవం మీది.
నా 45 ఏళ్ల సినీ జర్నీలో వెండితెరపైన వైవిధ్యమైన పాత్రలను పోషించడంతో పాటు, నా శక్తి మేరకు ప్రజలను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.నిజ జీవితంలోనూ నాకు చేతనైన సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అయినా కూడా నాపై చూపిస్తున్న కొండంత ప్రేమకు నేను ఇచ్చేది గోరంత మాత్రమే.ఇది నిజం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నాకు ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందించినందుకు కేంద్ర సర్కార్ కి భారత ప్రధాని మోదీకి నా కృతజ్ఞతలు”. అని చిరంజీవి భావోద్వేగమయ్యారు.