Chandrababu: ఏపీలో ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీలని, ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ చేపట్టే ప్రజా సంబంధ కార్యక్రమాలని చట్టాన్ని ఉపయోగించుకుని అడ్డుకుంటుంది. ఇక ప్రతిపక్ష టీడీపీ కూడా తగ్గేది లే అనే విధంగా అధికార పార్టీపై మాటలతో రెచ్చిపోతుంది. అలాగే చట్టంతో మమ్మల్ని అడ్డుకుంటే ఆ చట్టాన్ని అతిక్రమించి అయిన ప్రజలలోకి వెళ్తాం అంటూ టీడీపీ రాజకీయాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని టీడీపీ ప్రధానంగా చెప్పే మాట.
అయితే చట్టానికి లోబడి తమ నిర్ణయాలు ఉంటాయని, ప్రజలకి ఆటంకం కలిగించే వేటినైనా ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో నారా లోకేష్ ఇప్పటికే పోలీసులకి నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే వైసీపీకి తొత్తులుగా మారిన పోలీసు అధికారులని గుర్తించి వారికి తాము ఏంటి అనేది చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే జగన్ రెడ్డికి కూడా భయం అంటే ఏంటో చూపిస్తానని, వైసీపీ నేతలు రోడ్ల మీద తిరగకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కూడా కాస్తా ప్రతీకార ధోరణిలోనే వ్యాఖ్యలు చేస్తూ ఉండటం ఇప్పుడు రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులు అందరిని బొక్కలో వేస్తాం అంటూ కాస్తా తీవ్రంగానే హెచ్చరించారు. అనపర్తి నియోజకవర్గంలో రోడ్ షో, సభకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు పాధయాత్ర చేశారు. అయితే పాదయాత్రని అడ్డుకోవడానికి పవర్ కట్ చేశారు. ఈ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు పోలీసులకి తీవ్రంగా హెచ్చరికలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.