TDP: ఏపీ రాజకీయాలలో ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలలో ఎలా అయిన గెలవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. చంద్రబాబు రాజకీయ చాణిక్యంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలని తనవైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక నుంచి, ప్రభుత్వం వ్యతిరేకత పెంచడంలో కొత్త పంథా ఫాలో అవుతున్నారు. జోనల్ సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎన్నికల ముందు మరల అభ్యర్ధులని ఎంపిక చేస్తే వారు జనంలోకి వెళ్ళడం కష్టం అవుతుందని ముందుగానే డిసైడ్ చేసి వారిని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడాలని సూచిస్తున్నారు.
తాజాగా నెల్లూరు జిల్లాలో జోనల్ సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు కర్నూల్, నంద్యాల నియోజకవర్గాలలో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులని ఖరారు చేశారు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటించడమే కాకుండా వారికి బాధ్యతలు కూడా అప్పగించి ప్రజలలోకి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉంటే మరో వైపు ప్రచార వ్యూహాలలో కూడా కొత్త పంథా ఎంచుకుంటున్నారు. గంజా వద్దు బ్రో అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రజలలోకి వెళ్లి గంజాయి నిర్మూలనపై చైతన్యం చేస్తున్నారు.
అలాగే టిడ్కో ఇళ్ళని ఇంకా లబ్ది దారులకి ఇవ్వలేదని చూపిస్తూ సెల్ఫీ చాలెంజ్ టూ జగన్ అంటూ కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని టిడ్కో ఇళ్ళ దగ్గర టీడీపీ నాయకులు సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్యాంపెయిన్ తో ప్రభుత్వం లబ్ది దారులకి ఇళ్ళు ఇవ్వడం లేదని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రానున్న ఎన్నికలలో కుప్పం నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని, దమ్ముంటే ఆపుకోవాలంటే జగన్ కి చాలెంజ్ విసిరారు. ఇలా అన్ని అంశాలలో స్పీడ్ చూపిస్తూ ప్రజాక్షేత్రంలోని తన అనుభవం, రాజకీయ చాణిక్యం చూపిస్తున్నారు.