Chandrababu: ఏపీలో 2024 ఎన్నికల లక్ష్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ వైసిపి బలమైన రాజకీయ వ్యూహాలతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి మళ్ళీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. ఇక జనసేన పార్టీ నిశ్శబ్దంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా జనసేన టిడిపి మధ్య బంధం బలపడుతుంది అనే ప్రచారం రాజకీయ వర్గాలలో నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జనసేన పొత్తు ఖాయమనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
జనసేనకి ఒక 25 స్థానాల వరకు టిడిపి ఇవ్వడానికి సిద్ధంగా ఉందనే మాట ప్రచారంలో ఉంది. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ స్థానాలు కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి గోదావరి జిల్లాలో జోరుగా రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఖరారు చేస్తూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా చంద్రబాబునాయుడు మరల పిఠాపురం నుంచి టిడిపి అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్పను అధికారికంగా ఖరారు చేశారు. అలాగే తుని నియోజకవర్గంలో నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తెను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్ఫామ్ చేశారు.
అయితే జనసేన అడుగుతున్న స్థానాలలో ఈ రెండు కూడా ఉండడం ఇప్పుడు రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జనసేన అభ్యర్థనని పక్కనపెట్టి ముందుగా అన్ని నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను ప్రకటించుకొని వెళ్లే ప్రయత్నం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పొత్తు అంటూనే మరోవైపు అభ్యర్థులను ఖరారు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అయితే ఎన్నికలు ముందు రెండు పార్టీల మధ్య సంధి కుదరకపోతే కచ్చితంగా అధికారంలోకి రావడానికి కావలసిన బలమైన అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
జనసేనని వ్యూహాత్మకంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు అన్ని నియోజకవర్గ అభ్యర్థులను ఖరారు చేసుకున్నట్లుగా రాజకీయ వర్గాలలో చర్చి నడుస్తుంది. అయితే చంద్రబాబు వ్యూహాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నాడా అనే ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తుంది. మరి చంద్రబాబు వ్యూహాల విషయంలో జనసైనికులు ఆ పార్టీకి సహకరిస్తారా అనేది ఇప్పుడు వేచి చూడాలి. నిజానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టి చంద్రబాబు అధికారికంగా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేయడం ఏమిటి అనేది చర్చనీయాంసంగా మారింది.