KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీతో దేశవ్యాప్తంగా తన రాజకీయాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మహారాష్ట్రలో ఇప్పటికే బలమైన క్యాడర్ ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కూడా కేసీఆర్ దృష్టి పెట్టబోతున్నారు. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు మొత్తం ఈ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే మొదటి నుంచి వైసీపీకి ఫేవర్ గా ఉండే బీఆర్ఎస్ పార్టీ మరల జగన్ ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించే ప్రయత్నం లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాపు ఓటు బ్యాంకు ఈ సారి జనసేన పవన్ కళ్యాణ్ వెంట నిలబడే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాపు ఓటర్లని అంబటి, అమర్నాథ్, పేర్ని నాని లాంటి కాపు నాయకులతో చెప్పించి మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నల్ గా వారికి జనసేనకి సపోర్ట్ చేయొద్దు అంటూ చెబుతున్నారు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ ని కాపు నాయకుడుగా చిత్రీకరించి అతనిని మిగిలిన వర్గాలకి దూరం చేయడంతో పాటుగా కాపులు కూడా పవన్ వెంట నిలబడకుండా చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా రంగంలోకి దించుతున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కాపు లీడర్ తోట చంద్రశేఖర్ ఉన్నారు. అతనిని అడ్డుపెట్టుకొని కాపుల ఓటు బ్యాంకు కొంతైనా చీల్చడం ద్వారా లబ్ది పొందాలని వైసీపీ భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా జగన్ కి సహకరించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.