Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అంటే అవుననే మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే అస్సలు తగ్గేది లే అనే మాట బీజేపీ వైపు నుంచి వస్తోంది. కాస్తా వాయిదా వేసాం అంతే కాని ఆపేది మాత్రం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమం చాలా కాలంగా నడుస్తోంది. ప్రైవేటీకరణపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు ప్రకటనలు చేసింది. కచ్చితంగా చేసి తీరుతాం అంటూ చెప్తోంది. అయితే ఉన్నపళంగా కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ తాజాగా విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ని సందర్శించారు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడే చేసే ఆలోచన లేదని మాత్రమే చెప్పారు తప్ప అస్సలు చేయమని ఎక్కడా చెప్పలేదు.
అయితే వెంటనే టీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగి తాము స్టీల్ ప్లాంట్ అంశాన్ని టేకప్ చేసి బిడ్ వేయడానికి కూడా రెడీ అవుతున్న నేపధ్యంలోనే బీజేపీ భయపడి వెనక్కి తగ్గిందని, కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అంటే అలా ఉంటుంది అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన క్రెడిట్ అంతా తమదే అంటూ కేటీఆర్, హరీష్ రావు చెప్పడం విశేషం. మా దెబ్బకి కేంద్రం దిగి వచ్చి వెనక్కి తగ్గిందని అంటున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు జనసేన పార్టీ కూడా స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మొదటి నుంచి తామే పోరాడుతున్నాం అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
కేంద్రంలో పెద్దలతో కలిసి ప్రతిసారి కలిసి స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులకి మొదటిగా మద్దతు ఇచ్చింది కూడా తామే అని పవన్ అంటున్నారు. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోందని విమర్శించారు. తమ కృషి ఫలితంగానే కేంద్ర మంత్రి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని చెప్పారని పవన్ ప్రకటన ద్వారా చెప్పాలనుకుంటున్న విషయం. ఇక ప్రైవేటీకరణకి మొదటి నుంచి తాము వ్యతిరేకంగా ఉన్నామని, దానిని కేంద్రం దృష్టిని తమ ఎంపీలు, ముఖ్యమంత్రి జగన్ తీసుకెళ్లడం వలనే ఈ రోజు ప్రైవేటీకరణ వాయిదా వేసారని వైసీపీ చెప్పుకుంటుంది. నిజానికి కేంద్ర మంత్రి ప్రకటన ఏదో కొంత గందరగోళానికి తెరదించడానికి చేసినట్లు అనిపిస్తోంది.