BJP: ఏపీలో అధికార పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా 2014 కాంబినేషన్ ని రిపీట్ చేసే ప్రయత్నంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు. తాజాగా తూర్పు గోదావరి పర్యటనలో రానున్న ఎన్నికలలో పొత్తులు ఉంటాయని స్పష్టంగా చెప్పేశారు. అలాగే టీడీపీ, జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కూడా క్లారిటీ ఇచ్చారు. బీజేపీని లెక్కలు చూపించి ఒప్పిస్తానని అన్నారు. ఢిల్లీ పర్యటనలో కూడా జేపీ నడ్డాకి ఈ విషయం చెప్పడం జరిగిందని తెలిపారు. వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులు పెట్టుకోవడం ద్వారానే వైసీపీ రాక్షస పాలన నుంచి ఏపీకి విముక్తి లభిస్తుందని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రకటనతో వైసీపీలో కలవరం మొదలైందని చెప్పాలి.
దీంతో పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకొని వైసీపీ నేతలు ఎప్పటిలాగే విమర్శల దాడి మొదలు పెట్టారు. అయితే జనసేన, టీడీపీ పొత్తు అనివార్యం అని వారికి అర్ధం కావడంతో ఇప్పుడు మరో వ్యూహాన్ని సిద్ధం చేసుకునే పనిలో వైసీపీ ఉంది. ఇక ఏపీలోని బీజేపీ నేతలు మొన్నటి వరకు టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తామని చెబుతూ ఉండేవారు. టీడీపీపైన సోము వీర్రాజు లాంటి వారు తీవ్ర విమర్శలు చేసేవారు.
అయితే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతల స్వరంలో మార్పు వచ్చింది. పొత్తులపై కేంద్రంలోని పెద్దలు నిర్ణయం తీసుకుంటారని, వారు సూచించిన మార్గంలోనే మా ప్రయాణం సాగుతుందని చెప్పారు. సోముతో పాటు జీవీఎల్ కూడా ఇదే స్టేట్ మెంట్ ఇవ్వడం విశేషం. కర్ణాటకలో ఓటమితో దెబ్బ తిన్న బీజేపీకి సౌత్ లో ఆధిపత్యం కొనసాగించడానికి తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పవన్ కళ్యాణ్ సూచించిన పొత్తుకి వారు ఒకే చెప్పొచ్చు అనే మాట వినిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ కలయిక ఏ మేరకు సాధ్యం అవుతుంది, అలాగే వైసీపీకి అధికారాన్ని దూరం చేస్తుందా అనేది చూడాలి.