Health: కోవిడ్-19 ఆంక్షలు సడలించడంతో, ప్రజలు మళ్లీ తమ సాధారణ జీవితాలను పునరుద్ధరించారు. మహమ్మారి అందరినీ కోలుకోలేని దెబ్బతీసింది. అయితే సీనియర్ సిటిజన్‌లతో పాటు పిల్లలకు కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు అందుబాటు లో లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. ఈ మధ్యనే ఆన్‌లైన్ తరగతులు ముగియడంతో పిల్లలు పాఠశాలలకు తిరిగి వెళ్లడం ప్రారంభించారు. అయితే వారిలో వైరల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ మధ్యన చాలా మంది పిల్లలు సాధారణం కంటే తరచుగా అనారోగ్యానికి గురవుతారు.
పాఠశాల పునఃప్రారంభం చిన్నపిల్లల జీవితాన్ని సాధారణ స్థితిని తెచ్చిపెట్టినప్పటికీ , రెండేళ్ల విరామం పిల్లలలో రోగనిరోధక శక్తిని తగ్గించేసింది. అతి జాగ్రత్త పడటం, ఇంట్లో ఎక్కువసేపు ఉండటం వల్ల కరోనా సమయంలో పిల్లలు వ్యాధి బారిన పడలేదు. కానీ అది ఇప్పుడు వారిపై ప్రభావం చూపుతోంది. అందుకే తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. దగ్గు, అలెర్జీలు, వైరల్ ఇన్‌ఫెక్షన్, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు, జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్‌ల తో ఇబ్బంది పడుతున్న పిల్లలకు సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది .
ఇటీవలి జరిగిన అధ్యయనం ప్రకారం, కరోనా మహమ్మారి సమయంలో, పాఠశాలకు వెళ్లే పిల్లల శారీరక శ్రమ రోజుకు 70 శాతం తగ్గి అనారోగ్యం బారిన పడే అవకాశాలు బాగా పెరిగాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసి వారు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమను పొందేలా చూసుకోవడం చాలా ముఖ్యం . ఫిజికల్ ఆక్టివిటీ లేని పిల్లలు రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయడమే కాకుండా వారి శారీరక ఎదుగుదలను కూడా అడ్డుకుంటుంది. అందువల్ల, ఆట సమయం, చదువు ల మధ్య సమతుల్యతను నిర్ధారించడం ఇప్పుడు తల్లిదండ్రులకు చాలా కీలకం.
రెండు సంవత్సరాలుగా పిల్లలు సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా వారి బలహీనమైన రోగనిరోధక శక్తికి కారణం. మహమ్మారి కారణంగా ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉంటూ పిల్లలు ఫోన్లకు బానిసలు అయ్యారు. ఒక్క నిమిషం కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డకు తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది వారి రోగ నిరోధక వ్యవస్థకు అవసరం. సరైన నిద్ర చక్రాన్ని నిర్వహించడం అనేది బలమైన సహజమైన, అనుకూల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడు తుంది. తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలను నివారించడంలో పిల్లలకు సహాయపడుతుంది.
పిల్లలు పిజ్జా, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్లను తినడానికి ఇష్టపడతారు. ఇది తరచుగా వారిలో ఊబకాయానికి దారి తీస్తుంది. ఇవి అంత ఆరోగ్యకరమైన ఫుడ్ కాదు. పిల్లల రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కాబట్టి హెల్తీ డైట్ వారి ఆహారంలో భాగం చేయాలి. పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి వారి జీర్ణక్రియను మెరుగుపరచడానికి ప్రతిరోజూ వారి కుటుంబం యొక్క ఆహారంలో కనీసం 5 కూరగాయలను చేర్చాలి. అదనంగా, ఇంట్లో మీ పిల్లలకి ఆరోగ్యకరమైన పరిశుభ్రత పద్ధతులను బోధించాలి.