Acidity: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవన విధానంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆహార విషయంలో ప్రతి ఒక్కరు ఎన్నో మార్పులు చేసుకున్నారు. పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను పక్కనపెట్టి ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా మన ఆహారంలో మార్పులు రావడం వల్ల చాలామంది ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు బాధపడుతున్నటువంటి సమస్యలలో ఎసిడిటీ సమస్య ఒకటి. చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈ అసిడిటీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇలా ఈ సమస్యతో బాధపడటానికి కారణం లేకపోలేదని చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో చాలామంది తక్కువ సమయం ఉండటంతో పెద్దపెద్ద ముద్దలు తీసుకొని తింటారు తద్వారా తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవ్వటానికి ఇబ్బందులు తలెత్తడంతో ఎసిడిటీ ఏర్పడుతుంది.
మధ్యాహ్న భోజనానికి ముందు మధ్యమధ్యలో నీరు తాగడం వల్ల కడుపులోని జీర్ణక్రియ ఎంజైమ్‌లకు హాని కలుగుతుందని నిపుణుల అభిప్రాయం. ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు మొదలవుతాయి. మధ్యాహ్న భోజనంలో కూరగాయలను తక్కువగా తీసుకోవడం కూడా అసిడిటీ సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల కూడా ఎసిడిటీ పెరిగి జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుంది.