Wed. Jan 21st, 2026

    Health: 24 గంటల్లో దాదాపు 16 గంటలు వివిధ పనుల్లో అందరూ బిజీగా ఉంటారు. వారి వారి కొలువుల్లో నిమగ్నమయ్యేవారు కొంతమందైతే మరికొంత మంది ఇంటిపనుల్లో బిజీ బిజీగా గడుపుతుంటుంటారు. మరి ఇన్ని గంటలు ఎనర్జీతో వారి పనులు చేయాలంటే మాత్రం కడుపు నిండుగా ఆహారం తినాల్సి ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు సమయానుకూలంగా తీసుకోవడం వల్ల శక్తితో ఉండటంతో పాటు పనులను ఎంతో చురుగ్గా చేయగలుగు తాము. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది సమయం కాని సమయంలో వేళ కాని వేళల్లో ఆహారాన్ని తీసుకుంటున్నాము.

    దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల ను మూటగట్టుకుంటున్నాము. కడుపు నిండా తింటున్నాం దానికి టైంతో పనేంటని చాలా మంది అడిగే ప్రశ్న అక్కడికే వస్తున్నా ఉదయం ఖాళీ పొట్టతో ఆఫీస్‌కు వెళితే ఆలోచనంతా ఆహారంపైనే ఉంటుంది. టైంకి బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల తలనొప్పి మొదలవుతుంది. దాని ప్రభావం పనిపై పడుతుంది. అరగంటలో పూర్తి చేయాల్సిన పనిని ఆరు గంటలైనా ఆలస్యంగా చేయాల్సి వస్తుంది. ఇది ఏదో అంచనా వేసి చేప్పే మాటలు కావు మీరు ఇలాంటి సిచువేషన్‌నే ఫేస్ చేస్తున్నారన్నది వాస్తవం. బ్రేక్ ఫాస్ట్ లేట్ చేయడంతో లంచ్ టైం మారిపోతుంది. ఆ తరువాత డిన్నర్‌ కూడా లేట్‌నైట్ చేయాల్సి వస్తుంది. లేట్ గా తింటే ఏముంది అనుకుని నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడే అసలు కిటుకు ఉంది.

    are you eating breakfast and dinner late
    are you eating breakfast and dinner late

    ప్రతి రోజు ఉదయం తినే ఫస్ట్ మీల్ అందరికి చాలా ఇంపార్టెంట్‌. దీనిని స్కిప్ చేయకూడదు. సన్నంగా అవ్వవాలనో, బరువును నియంత్రించాలనో మరి ఏ కారణాలతో అయినా బ్రేక్‌ ఫాస్ట్‌ను చాలా మంది బ్రేక్ చేస్తున్నారు. ఉదయం టిఫిన్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని భ్రమపడుతుంటారు. నిజానికి ఒకప్పుడు ఉదయం పూట మన పూర్వికులు చక్కగా ప్లేటు నిండా అన్నం పెట్టుకుని తినేవారు. కానీ వారెవరు అప్పట్లో అనారోగ్య సమస్యలతో బాధపడలేదే. ఉదయం చక్కగా చద్ది బువ్వ తిని పొలం పనులకు వెళ్లి శారీరక శ్రమ చేసేవారు. అందుకే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. తినే ఆహారంలో ఫాట్ లేకుండా పోషకాలు ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. నూనె తో తయారు చేసే హెవీ బ్రేక్‌ఫాస్ట్‌లు కాకుండా ఇడ్లీ, దోస, పుల్కాలు, జ్యూస్‌లు, రాగిజావ, ఫ్రూట్స్‌, లేదా నట్స్‌, పల్సస్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోండి.

    అంతే కానీ పూర్తిగా తినడం మానేయవద్దు. అలా బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల గుండె సంబంధిత జబ్బుల తో పాటు డయాబెటిస్‌ సమస్యలు అధికంగా వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పూర్తిగా మానేయడంతో పాటు ఆలస్యంగా తినడం వల్ల కూడా ఇవే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నా రు. ఇలా ఆలస్యంగా తినడం వల్ల మైగ్రేన్, తలనొప్పి సమస్యలతో సతమతమవడం ఖాయమంటున్నారు. అంతే కాదు రక్త హీనత సమస్య బారిన పడతామంటున్నారు. చిన్నపిల్లలు బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తే వారి ఎదుగుదల లోపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదండోయ్ బట్టతల సమస్య కూడా చాలా మందికి అల్పా హారం తీసుకోకపోవడం వల్లనే వస్తుందని తెలుస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయం అంటే 8 నుంచి 10 గంటలలోపు బ్రేక్ ఫాస్ట్ కంపల్సరీ చేయాలి.

    ఇక రాత్రి వేళల్లోనూ చాలా మంది పడుకుంటే బరువు పెరుగుతామని, అరగదని డిన్నర్ స్కిప్ చేస్తారు. మరికొంత మంది ఏకంగా అర్థరాత్రిళ్లు బిర్యానీలను లాగించేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవు తాయి. ముఖ్యంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల అధిక బరువు సమస్య వేధిస్తుందని వైద్యులు చెబుతున్నారు అయితే రాత్రిళ్లు ఆలస్యంగా తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తాయి. అరుగుదల లేక ఉదయం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాని వల్ల డే అంతా ఫుల్ హెక్టిక్‌గా మారుతుంది. ఆఫీసులో పని కూడా ప్రశాంతంగా చేసుకోలేము. నిజానికి ఆలస్యంగా తినడం అనేది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు.

    అప్పట్లో రాత్రి 6,7 గంటలకే డిన్నర్ పూర్తి చేసుకుని కంటి నిండా నిద్రపోయేవారు. కానీ మారిన కాలంతో పాటుగా జీవనశైలి, ఆహారం తీసుకోవడంలోనూ మార్పులు వచ్చాయి. పని ఒత్తిడి కారణంగా కూడా చాలా మంది ఆలస్యంగా డిన్నర్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ పద్ధతికి బ్రేక్ ఇచ్చి సమయానికి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ లేట్‌నైట్ తినాల్సి వస్తే ఎం తింటున్నాము? ఎంత తింటున్నాము అన్న విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకునే ఫుడ్‌పైన పూర్తి అవగాహన ఉండి, టైం సెన్స్‌ను ఫాలో అయితే చాలా వరకు అనారోగ్య సమస్యలకు డాక్టర్ల అవసరం లేకుండానే పరిష్కారం చూపించగలం.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.