Politics: ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీగా తెలుగుదేశంకి ప్రత్యేక గుర్తింపు ఉంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో పార్టీ సుదీర్ఘకాలం కొనసాగుతూ బలమైన పునాదులను వేసుకొని నిలబడింది. గత ఎన్నికల్లో వైసిపి ప్రభంజనంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. అయితే అలాంటి దెబ్బ తగిలిన తర్వాత కూడా టిడిపి పార్టీ బలంగా నిలబడగలిగింది అంటే దానికి కారణం బలమైన నాయకత్వం, బూత్ స్థాయిలో బలమైన కార్యకర్తలు ఉండటమే కారణం అని చెప్పాలి. నిజానికి గత ఎన్నికలలో ఓడిపోయిన కూడా 40% ఓట్ షేరింగ్ ని టిడిపి సొంతం చేసుకుంది. దీనిని బట్టి ఆ పార్టీ సంస్థాగతంగా ఎంత బలంగా ఉంది అనేది చెప్పొచ్చు.
అయితే ఒకప్పుడు బలమైన నాయకులందరూ కూడా ఇప్పుడు టిడిపిలో సీనియర్లుగా మారిపోయారు. ఇప్పటికే చాలాసార్లు ఆ నాయకులు ప్రజలు గెలిపించి వారి పాలన చూసేసారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ ప్రజలు కొత్త నాయకులను చూడాలని భావిస్తుంది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా గ్రహించి ఈసారి 40 నుంచి 50% సీట్లు యువతకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే యువత ఓటర్లను ఆకర్షించే బాధ్యతను నారా లోకేష్ అప్పగించారు. నారా లోకేష్ పాదయాత్ర ద్వారా యువతరంతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం మొదలుపెట్టారు. మరోవైపు ఎన్నికల సమీపిస్తున్న కొద్ది టిడిపిలో సీనియర్ నాయకులు అసహనం ఎక్కువగా కనిపిస్తుంది.
ఆమధ్య తునిలో యనమల రామకృష్ణుడు అతని తమ్ముడు మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా విమర్శలు చేసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి విజయవాడలో ఎంపీ కేశినేని నాని టిడిపి నాయకులుపై విమర్శలు చేస్తున్నారు. పేర్లు చెప్పకుండానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా పై నాని తీవ్ర విమర్శలు చేశారు. కాల్ మనీ, మాఫియా, తప్పుడు మార్గాల్లో వెళ్లి నాయకులపై అధిష్టానం దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట సొంత పార్టీ నాయకులు పైనే కేశినేని నాని విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా విశాఖపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు నేరుగా గంట శ్రీనివాసరావుపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. గంటా శ్రీనివాసరావు ఏమి ప్రధానమంత్రి కాదని లక్షల మంది జనంలో అతను ఒకడని చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడకుండా ఎన్నికల ముందు వచ్చే అలాంటి వారి గురించి నేను ఎక్కువగా మాట్లాడను అని ఘాటుగానే విమర్శలు చేశారు. ఇక రాయలసీమలో కూడా టిడిపి పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. అలాగే పల్నాడు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అధిష్టానం యువతకు పెద్దపేట వేస్తారనే ప్రచారం బయటకు వచ్చినప్పటి నుంచి టిడిపిలో సీనియర్లు అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. మరి వారి అసహనం ఎన్నికల ముందు పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందేమో అనేది చూడాలి.