AP Politics: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం ఓ రకంగా ఎన్నికల వేడి ఉందని చెప్పాలి. ఓ వైపు వైసీపీ సర్కార్ జగనన్నే మా భవిష్యత్తు అంటూ ఎమ్మెల్యేలని భుజానికి బ్యాగులు తగిలించుకొని ఇంటింటికి పంపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, గ్రామ సారథులు ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తూ వారి వివారాలు సేకరిస్తూ కొత్తరకమైన ప్రచారం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ప్రచారంలో దూకుడుగానే వ్యవహరిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు.
అందుకే జగన్ విమర్శలకి దీటుగా ప్రతి విమర్శలు చేస్తున్నారు. జగన్ తనని తాను బయటకి వచ్చిన ప్రతిసారి మీ బిడ్డ అంటూ పరిచయం చేసుకుంటారు. అయితే చంద్రబాబు దీనిపై దీటుగానే రియాక్ట్ అయ్యారు. జగన్ ఏపీ ప్రజలకి బిడ్డ కాదని, క్యాన్సర్ గడ్డ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను ఎంత వేగంగా అధికారంలోంచి దిగిపోతే ఏపీ అంత అభివృద్ధి చెందుతుంది అని ప్రజలకి చెబుతున్నారు. మరో వైపు టీడీపీ నాయకులు నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఇసుక దోపిడీని తెరపైకి తీసుకొచ్చి చూపిస్తున్నారు.
అభివృద్ధిపై ప్రశ్నిస్తున్నారు. అలాగే నారా లోకేష్ కూడా యువగళం పాదయాత్రతో స్పీడ్ మీద ఉన్నారు. అధికార పార్టీ వైఫల్యాలని ఎండగడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార పార్టీ నాయకులు అందరూ కూడా నారా లోకేష్ పై ఎదురుదాడి చేస్తున్నారు. లోకేష్ కు కూడా కావాల్సిందే ఇదే కావడం విశేషం. ఇక మరో ఏడాది కాలం మాత్రమే ఉండటంతో మరింత బలంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలని ఎండగట్టడంలో చంద్రబాబు కచ్చితమైన వ్యూహాలు వేసుకుంటూ వెళ్తున్నారు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.