Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా అగ్రెసివ్ గా రాజకీయాలు నడుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉత్సాహంతో నియోజకవర్గాలలో చాలా వేగంగా వర్క్ చేస్తున్నారు. ప్రతి అంశం మీద పోరాటం చేస్తున్నారు. ఇక వైసీపీ కూడా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇది కూడా ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ కి ప్రజలలో సానుభూతి పెరగడానికి కారణం అవుతుంది. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు ఎన్ని రకాలుగా వ్యక్తిగత విమర్శలు చేసిన కూడా మరింతగా తన మాటలకి, చేతలకి పదును పెడుతూ జనసేనాని ముందుకి వెళ్తున్నారు.
ఇదే వేగంతో జనం మధ్యకి వెళ్తే రానున్న ఎన్నికలలో ప్రధాన పోటీ వైసీపీ, జనసేన మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసి తరువాత దానిని కాంగ్రెస్ పార్టీలో కలిపేసారు. ఈ ప్రభావం కూడా జనసేనాని మీద ఉంది. చిరంజీవి వల్ల కానిది పవన్ కళ్యాణ్ వలన అవుతుందా అని విమర్శించే వారు ఉన్నారు. అలాగే అన్న కాంగ్రెస్ కి పార్టీని అమ్మేశాడు. తమ్ముడు టీడీపీకి జనసేన పార్టీని తాకట్టు పెట్టేసాడు అంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. వాటిని కూడా బలంగానే పవన్ ఎదుర్కొంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు జనసేన పార్టీకి తన మద్దతు ఉంటుంది అంటూ పరోక్షంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెబుతున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఎక్కువ అని, ఇప్పుడు ఆ దిశగానే తన ప్రయాణం సాగుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇక తాజాగా హైదరాబాద్ లో చిరంజీవి కాలేజీ మిత్రుల కలయిక జరిగింది. ఈ సమావేశంలో చిరంజీవి రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి అస్సలు రాజకీయాలు సెట్ కావని, అందులోకి దిగిన తర్వాత తెలిసిందని చెప్పారు. రాజకీయాలలో ఉంటే అవసరం ఉన్న లేకపోయిన అవతలి వారిపై విమర్శలు చేయాలి. అదే సమయంలో ప్రత్యర్ధులు చేసే విమర్శలని కూడా తీసుకోవాలి. అయితే ఈ రెండు తనకి సాధ్యం కాదని చెప్పాడు. తనలాంటి వారు రాజకీయాలకి సెట్ కారని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే తాను మాత్రం విమర్శిస్తాడు. విమర్శలని కూడా తీసుకుంటాడు. వాటిని తట్టుకోవడం తనకి అలవాటే అంటూ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ని కచ్చితంగా గొప్ప స్థానంలో చూస్తామని, మీ అందరి చల్లని దీవెనలు కూడా అతనికి ఉండాలి అంటూ తన అభిమానులతో పాటు, మిత్రులని కూడా పవన్ కళ్యాణ్ కి అండగా ఉండమని చెప్పకనే చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ కి చిరంజీవి మద్దతు లేదని విమర్శించే వారికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది. ఇక మెగాస్టార్ పిలుపుతో మెగాభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవటానికి చిరంజీవి ఊతం ఇచ్చినట్లు అతని కామెంట్స్ తో అయ్యిందనే టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.