Business: ఇదంతా స్మార్ట్ యుగం. ఏం కొనాలన్నా , తినాలన్నా ఆఖరికి ప్రయాణించాలన్నా పక్కవారితో మాట్లాడలన్నా అన్నీ ఫోన్‌లతోనే కవర్ చేసేస్తున్నాము. మనకు కావాల్సిన ప్రతి వస్తువును ఫింగర్‌టిప్స్‌తో ఇంటి ముంగిటకు తెచ్చుకుంటున్నాము. గ్రాసరీస్ దగ్గరి నుంచి తినే ఆహారం వరకు ఇప్పుడు చాలా మంది ఆన్‌లైన్ ద్వారానే పొందుతున్నారు. అయితే ఆరోగ్య రంగంలో మాత్రం మందులు కావాలంటే మెడికల్ షాప్‌లకు పరుగులు పెడుతున్నాము. ఈ క్రమంలో మందులను సైతం ఇంటి ముంగిట చేర్చాలన్నా ఐడియాతో పాటు ఈ రంగంలో ఆర్ధికాభివృద్ధి ఉందని గుర్తించిన కొంత మంది ఎంటర్‌ప్రీనర్లు అద్భుతమైన ఆలోచనతో ఆన్‌లైన్‌లో మందులను విక్రయిస్తూ ఆర్ధికాభివృద్ధిని సాధిస్తున్నారు.
ఇన్‌కమ్, ఎంప్లాయ్‌మెంట్ పరంగా ఆరోగ్య సంరక్షణ భారతదేశం యొక్క అతిపెద్ద రంగాలలో ఒకటిగా మారింది. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం 2022 నాటికి 372 బిలియన్లకు చేరుతుందని ఒక అంచనా. హెల్త్ కేర్ రంగంలో ఈ వృద్ధి కారణంగా, భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అనేక హెల్త్‌టెక్ స్టార్టప్‌లు ఉద్భవించాయి. ఆ హెల్త్‌టెక్ స్టార్టప్‌లలో ఒకటి ఫార్మ్ ఈజీ. భారతదేశంలో ఆన్‌లైన్ ఫార్మసీని అందించే టాప్ హెల్త్‌కేర్ స్టార్టప్‌లలో ఫార్మ్ ఈజీ ఒకటిగా నిలుస్తోంది. మరి ఈ ఆన్‌లైన్ ఫార్మసీ దిగ్గజం సక్సెస్ మంత్రా ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ ముంబై బేస్డ్ ఆన్‌లైన్ ఫార్మసీ కంపెనీని 2015లో ధవల్ షా, ధర్మిల్ షేత్ లు సంయుక్తంగా స్థాపించారు. 18 మంది పెట్టుబడిదారులు ఈ కంపెనీలో తమ మద్దతును అందించారు.
ఫార్మ్ ఈజీ మొత్తం 328.5 మిలియన్ల నిధులను పొందింది. బిజినెస్‌లో డిగ్రీ పట్టాను పొందిన ధవల్ షా, ధర్మిల్ షేత్‌లు ఆరోగ్య సంరక్షణ రంగంలో లార్జ్ పొటెన్షియల్ ఉందని గుర్తించి ఈ రంగంవైపు అడుగులు వేశారు. ధవల్ షా కూడా ఒక వైద్యుడు కావడం వల్ల హెల్త్ టెక్ సెక్టార్‌లో పొటెన్షియల్ ఉందని గుర్తించారు. ఆరోగ్య సంరక్షణ వ్యాపారం ఒక సర్కిల్ లాంటిది ఏ సమయంలోనైనా ప్రవేశించవచ్చు అని ధవల్ పేర్కొన్నారు. భారతదేశ ఆరోగ్య సంరక్షణ సవాళ్లను సాంకేతికత మాత్రమే పరిష్కరించగలదని అందుకే ఆన్‌లైన్‌లో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇటువైపుగా వచ్చామని ధర్మిల్ శేత్ తెలిపారు.
మంచి మార్కెటింగ్ తో, సరైన విజన్‌తో ముందుకు వెళుతోన్న ఈ ఫార్మ్ ఈజీ కంపెనీ భారతదేశంలోని అత్యంత విజయవంతమైన హెల్త్‌కేర్ స్టార్టప్‌లలో ఒకటిగా నిలుస్తోంది. 150 మంది పార్టనర్ వెండర్స్‌తో, ఫార్మ్ ఈజీ ప్రస్తుతం భారతదేశంలోని 1000పైగా నగరాల్లో మందులను డెలివరీ చేస్తోంది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, పూణె, జైపూర్ బెంగళూరుతో సహా 22000 పిన్ కోడ్‌లను కవర్ చేస్తుంది ఈ కంపెనీ.