Family Values: ఒక పిల్లాడు ఆడుకునే వయసులో ఓ చోట అగ్గిపెట్టె దొరికిందని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఎక్కడ దొరికింది అని అడగకుండా తల్లి దానిని తీసుకుంది. అప్పుడు కొడుకు చేసిన పని తల్లికి తప్పని అనిపించలేదు. 10 ఏళ్ళ వయస్సులో కొడుకు పది రూపాయిలు తీసుకెళ్ళి వెయ్యి రూపాయిలు ఇంటికి తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడు. అప్పుడు కొడుకు పది రూపాయిలతో వెయ్యి రూపాయిలు సంపాదించిన కొడుకు గొప్పతనం తండ్రి మెచ్చుకున్నాడు తప్ప ఎలా సంపాదించావ్ అని అడగలేదు. దాంతో పేకాట ఆడి డబ్బు సంపాదించిన కొడుకుకి అది తప్పు అనిపించలేదు.
16 ఏళ్ళ వయస్సులో కొడుకు బంగారు గొలుసు తీసుకొచ్చి తల్లికి కానుకగా ఇచ్చాడు. అప్పటి వరకు బంగారం చూసి ఎరుగని తల్లికి దాని మీద ఆశ కలిగింది తప్ప కొడుకుకి అదెలా వచ్చింది అనే విషయం తెలుసుకోవాలనే ఆలోచన రాలేదు. దొంగతనం చేయడం తప్పుకాదని అప్పుడు కొడుక్కి అనిపించింది. 22 ఏళ్ళ వయస్సులో కొడుకు ఓ హత్య చేసి 10 లక్షలు తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడు. ఆ పది లక్షలు కనిపించినప్పుడు తండ్రికి డబ్బు మీద కోరిక కలిగింది తప్ప అదెలా వచ్చిందో తెలుసుకోవాలని ఆలోచన రాలేదు.
హత్య చేయడం కొడుక్కి తప్పు అనిపించలేదు. అయితే కొద్ది రోజుల్లోనే కొడుకు చేసిన తప్పుకి శిక్ష పడింది. చిన్న వయస్సులోనే యావజ్జీవ శిక్ష పడింది. తనతో ఉన్న ఖైదీలు అందరూ తాను చిన్నప్పటి నుంచి చేసిన అన్ని తప్పులు చేసి జైల్లో ఉన్నారు. అప్పుడు కొడుక్కి అర్ధమైంది తాను చిన్న వయస్సు నుంచి చేసిన ప్రతి పని తప్పే అని. కొడుక్కి కోపం వచ్చింది. నేరం చేసిన వాడు నేరస్తుడు అయితే ఆ నేరాన్ని ప్రోత్సహించిన వారు కొడుకు చేసిన తప్పుని కనీసం పట్టించుకోని తల్లిదండ్రులు కూడా నేరస్తులే అవుతారు కదా అనిపించింది.
తల్లిదండ్రుల మీద ఆ కొడుకు కేసు పెట్టాడు. తాను హత్య చేయడానికి కారణం నా తల్లిదండ్రులే అని పోలీసులకి చెప్పాడు. పోలీసులు ఆ తల్లిదండ్రులని అరెస్ట్ చేసారు. వారి చేసిన నేరానికి కోర్టులో ప్రవేశ పెట్టారు. కొడుకుని హత్య చేయమని ఏ తల్లిదండ్రులు ప్రోత్సహించరు కదా మరి మాపై మా కొడుకు ఎందుకు కేసు పెట్టాడో మాకే తెలియడం లేదు అని ఆ తల్లిదండ్రులు చెప్పారు. జడ్జ్ కొడుకు వైపు చూసి నిన్ను ఆ హత్య చేయమని నీ తల్లిదండ్రులు ప్రోత్సహించారా అని అడిగారు.
చిన్న వయస్సులో ఒక అగ్గిపెట్టె దొంగతనం చేసి మా అమ్మకి ఇచ్చాను అది ఎక్కడిది అని అడగలేదు. నేను ఎలా తీసుకొచ్చాను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే అది నాకు తప్పు అనిపించలేదు. దొంగతనాలు చేసుకుంటూ వెళ్లాను. 10 రూపాయిలతో పేకాట ఆడి వెయ్యి రూపాయిలు మా నాన్నకి ఇచ్చాను. నా సంపాదన చూసి మా నాన్న మురిసిపోయాడు తప్ప ఆ వెయ్యి ఎలా సంపాదించాను అడగలేదు. అది నాకు తప్పు అనిపించలేదు.
16 ఏళ్ళ వయస్సులో మా అమ్మకి బంగారు చైన్ తీసుకొచ్చి ఇచ్చాను. దాన్ని ఆశగా తీసుకొని మెళ్ళో వేసుకుంది తప్ప నేను ఎలా తీసుకొచ్చాను అని అడగలేదు. బంగారం దొంగతనం చేయడం నాకు తప్పు అనిపించలేదు. ఇవన్ని తప్పులు కానప్పుడు 10 లక్షలు దొంగతనం చేసే ప్రయత్నంలో ఒకరిని హత్య చేసాను. అది కూడా నాకు తప్పు అనిపించలేదు. కాని నేను చిన్న వయస్సు నుంచి చేసిన ప్రతి తప్పుకి నాతో పాటు జైల్లో ఎంతో మంది శిక్ష అనుభవిస్తున్నారు. నేను చేసింది తప్పని 5 ఏళ్ళ వయస్సులోనే నా తల్లిదండ్రులు చెప్పుంటే మళ్ళీ దొంగతనం చేయాలనే ఆలోచన నాకు వచ్చేది కాదు.
ఆ రోజు నేను దొంగతనం చేసింది అగ్గిపెట్టె కాని అది తప్పుకాదని నాకు చెప్పేవాళ్ళు లేకపోవడంతో ఈ రోజు 10 లక్షల కోసం ఒకరిని హత్య చేసే స్థాయికి వచ్చేవాడిని కాదు కదా… నేను ఇన్ని తప్పులు చేయడానికి కారణం అయిన వారు నేరస్తులే అవుతారు కదా అని కొడుకు చెప్పిన మాటకి జడ్జ్ నోట మాట రాలేదు. అలాగే ఆ తల్లిదండ్రులకి కూడా మాట రాలేదు. కొడుకు ఈ రోజు జైల్లో ఉండటానికి కారణం తామే అనే విషయం ఆ తల్లిదండ్రులకి అర్ధమైంది. ఈ కథలో నీతి ఏంటంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. పెరిగే వయస్సులో వారు చేసే ప్రతి పనిలో తప్పొప్పులని నిర్ణయించి వారిని సరైన దిశలో నడిపించాల్సిన బాద్యత పేరెంట్స్ మీదనే ఉంది.
సమాజంలో జరుగుతున్న చాలా నేరాలు అన్నింటికీ తల్లిదండ్రుల పెంపకమే అంటే కొందరు విమర్శించొచ్చు. కాని అదే వాస్తవం. ఇండియాలో జరుగుతున్న చాలా క్రైమ్స్ కి కారణం పేదరికం. పేదరికంలో పిల్లలు పెరుగుతున్నారు అంటే తల్లిదండ్రుల సంరక్షణలో వారు లేకుండా ఎదుగుతున్నారని అర్ధం. అలాంటి వారికి మంచి చెడుల గురించి అస్సలు తెలియదు. అలాంటి వారు సమాజానికి ప్రమాదకరంగా మారుతారు. క్రైమ్ కంట్రోల్ కావాలంటే పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు ద్యాస పెడితే చాలు. వారు చేసిన చిన్న చిన్న తప్పులని సరిచేస్తే చాలు. సమాజంలో చాలా నేరాలు, ఘోరాలు కొంత కాలానికి పూర్తిగా ఆగిపోతాయి.