Inspiring: ప్రతి మనిషి జీవితంలో ఓటమి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. విచారిస్తూ ఉంటాడు. నిరాశ, నిస్పృహకి లోనవుతూ కృంగిపోతూ జీవితంలో ముందుకి కదలలేక కష్టాల సుడిలో పడి క్రిందమీద పడుతూ ఉంటాడు. ప్రపంచంలో పేదరికానికి కారణం ఆశ లేకపోవడం. ముందుకి వెళ్లాలనే ద్యాస లేకపోవడం. ఉన్నా అడ్డంకులు ఉన్నాయని, చుట్టూ ఉన్న ఇబ్బందుల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండటం. కష్టాలు అనే ఆలోచనలని నిరంతరం మోస్తూ ఉండటమే. వీటన్నిటికీ కారణం ఓడిపోతామని భయంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండటం. ప్రతి రోజు బాధ్యతలు అనే భయంలో ప్రయాణం చేస్తూ ఉండటం. ఈ విషయం అందరికి తెలుసు కానీ నా జీవితం ఇంతే అనే ఇక నిరాశ దృక్పథంలో ఉండిపోయి బయటకి రాలేని జనమే మన చుట్టూ కనిపిస్తారు. నిజానికి ఓడిపోతామనే భయం దేనికి అసలు జీవితంలో ఓటమి అనేది ఉందా అంటే కచ్చితంగా లేదని నేనంటాను. ఓటమి అనేది లేదు అంటే చాలా మంది ఒప్పుకోరు.
ఎందుకంటే వారు జీవితంలో ఆ ఓటమి అనే అంశాన్ని పదే పదే అనుభవిస్తున్నారు. అలవాటుగా మార్చేసుకున్నారు అందుకే దానిని అంగీకరించడానికి చాలా మందికి వెంటనే మనసు రాదు. కానీ ఒక్కసారి మన జీవితం, మనిషి జీవితం ఎక్కడ మొదలయ్యిందో అనేది ఏక్షణమైన వెనక్కి తిరిగి వెళ్లి ఆలోచించడం మొదలు పెడితే ఇప్పటి వరకు మనం ఎప్పుడు ఓడిపోలేదు కదా అనిపిస్తుంది. తల్లి గర్భంలో ఒక విత్తనంగా ప్రాణం పోసుకున్న మనం తొమ్మిది నెలలు అక్కడే ఉన్నాం. కనీసం కదలలేని స్థితిలో జీవం వచ్చినప్పటి నుంచి ఈ భూమి మీదకి వచ్చే వరకు ఉన్నాం. అతి కష్టం మీద తల్లి గర్భాన్ని చీల్చుకుంటూ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాం. అదే మన మొదటి గెలుపు. ఆ గెలుపుని మనం ఆస్వాదించలేము. కళ్ళు తెరిచిన తర్వాత మనవాళ్ళని గుర్తించడానికి చేసే ప్రయత్నంలో మళ్ళీ గెలుస్తాం… ఇక ఊహ వచ్చిన తర్వాత మోకాళ్ళతో నడిచే ప్రయత్నం చేస్తాం మొదట్లో క్రింద పడతాం.
కానీ కొద్దీ రోజుల్లోనే మన ప్రయత్నంలో గెలుస్తాం. ఆ తరువాత నిలబడి నడిచే ప్రయత్నం చేస్తాం. క్రింద పడిన ప్రతిసారి లేచి నిలబడి నడిచే ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా సక్సెస్ అవుతాం. తరువాత పరిగెత్తే ప్రయత్నం చేస్తాం. ఆరంభంలో గాయాలైన అక్కడ కూడా గెలుపుని ఆస్వాదిస్తాం. తరువాత పాఠశాల వయస్సులో ప్రతి ప్రయాణంలో మన అడుగులు జీవితంలో ముందుకి పడుతూనే ఉంటాయి. ప్రయత్నం విఫలం అయిన మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ముందుకి ప్రయాణం చేస్తూనే ఉంటాం.
వయస్సులో కానీ జీవితం పరుగులో కానీ మనం విజేతలుగానే ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రయత్నం ఆగిపోతుందో, ఎప్పుడైతే ప్రయత్నంలో ఎదురయ్యే అవరోధాలకి భయపడటం మొదలు పెట్టామో, ఎప్పుడైతే జీవితంలో అంత వరకు మన వెంట ఉన్న గెలుపుని ఆస్వాదించడం మరిచిపోతామో అప్పుడే ఓటమిని అంగీకరించడం మొదలు పెడతాం. ఒక్కసారి ఓటమిని అంగీకరిస్తే నిరంతరం అది మనవెంటే ఉంటుంది. ఒక్కసారి ఓటమిని ఆస్వాదించడం మొదలు పెడితే అది నిరంతరం మనల్ని భయపెడుతూనే ఉంటుంది.
భయంతో పదే పదే పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ పొరపాట్లు మన జీవితాన్ని మరింత ప్రమాదంలో పడేస్తాయి. మానసికంగా మరింత ఒత్తిడిని పెంచేస్తాయి. మరింత భయాన్ని పరిచయం చేస్తాయి. ఇక అక్కడితోనే జీవితంలో గెలుపుని మరిచిపోతాం. అయినా మనకి తెలియకుండానే చావు సమీపించే వరకు కాలాన్ని గెలుస్తూనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ సమస్య ఏంటంటే ఓటమి అనే భయాన్ని వెంటే పెట్టుకొని గెలుపుని మరిచిపోవడం వలన జీవితంలో ఓడిపోతున్నామని అనిపిస్తుంది. ఒక్కసారి ఆ భయాన్ని దాటొచ్చి ఓటమి అనే మాటని చీకట్లో వదిలేసి ప్రతి అడుగులో గెలుపుని వెతకడం మొదలు పెట్టు. కాలం నీకు కావాల్సిన ప్రతిదీ ఇస్తుంది. జీవితం నిన్ను నిరంతరం సంతోషంలోనే ఉంచుతుంది. ప్రయాణం నీ ప్రతి ప్రయత్నానికి సహకరిస్తుంది.